అనంతపురం కల్చరల్: బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటున్నా మోజు తీరడం లేదు. ఎగబడి కొంటున్నారు. చాలా మందికి బంగారు ఆభరణాలను ధరించడమంటే మక్కువ. మహిళలకైతే ఇక చెప్పక్కర్లేదు. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే నిత్యం బంగారం చేతులు మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజుల్లో కొంతైనా బంగారం కొని దాచుకోవాలన్న సెంటిమెంట్ బలంగా ఉంటుంది. సోమవారం అక్షయ తృతీయ ఉండడంతో నగలు కొనడం కోసం అందరూ పరుగులు పెడుతున్నారు. తులం బంగారం రూ. లక్షన్నర దాటేస్తున్నా కొనుగోళ్లకు ఉత్సాహం చూపుతున్నారు.
జాగ్రత్త.. జాగ్రత్త
బంగారంపై ఉండే మోజు, ఆత్రంగా కొనేయాలనుకోవడం వల్ల విపణి వీధిలో అనేక మోసాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పుత్తడి కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలని వినియోగదారుల సంఘాల వారు సూచిస్తున్నారు.
● ఆఫర్ల పేరిట జరిగేవన్నీ మోసాలే. ఎందుకంటే తక్కువ ధరకు బంగారం విక్రయించాలని వ్యాపారులు అనుకోరు.
● కేడీఎం పేరుతో 24 క్యారెట్ల బంగారు నగలంటారు. వాస్తవానికి పూర్తి బంగారంతో ఆభరణాలు తయారు చేయడం సాధ్యం కాదు. తప్పనిసరిగా ఇతర లోహాలు వాడాల్సిందే.
● హాల్‌మార్క్ ఉందా లేదా చూసుకోవాలి. చైను, డాలర్ కలిసి కొనుగోలు చేసే సమయంలో కేవలం డాలర్‌పై మాత్రమే హాల్‌మార్క్ ఉంటుంది. చైనుపై కూడా ఉండేవి కొనాలి. బీఐఎస్ లోగో, స్వచ్ఛత సంఖ్య, తయారీ సంవత్సరం, తయారీ సంస్థ లోగో ఉండాలి. లేదంటే నాణ్యతా లోపం ఉన్నట్లు లెక్క.
● భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) అనుమతి లేకనే చాలా చోట్ల ఆభరణాలు అమ్ముతుంటారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
● వాల్యూ అడిషన్ చార్జెస్ పేరుతో ఇష్టానుసారంగా అంటే 15–28 శాతం వరకు వసూలు చేయకూడదు. దీన్ని గమనించాలి.
● తరుగు, ఇతర తయారీ ఖర్చుల విషయంలో ప్రధానంగా మోసం జరుగుతుంటుంది. నిజానికిది వినియోగదారులకు సంబంధించిన అంశం కానే కాదు. వీటిని ముందుగానే వాల్యూ అడిషన్ చార్జెస్ ద్వారా చెల్లిస్తాం. పెద్ద ఎత్తున మోసం జరిగేదిక్కడే.
నేడు అక్షయ తృతీయ
బంగారం కొనుగోళ్లకు
ఉత్సాహం చూపుతున్న ప్రజలు
కొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు
బ్రహ్మసముద్రానికి చెందిన తిమ్మక్క ఇటీవల అనంతపురంలోని ఓ బంగారు దుకాణంలో 20 గ్రాముల గోల్డ్ కొనుగోలు చేసింది. దుకాణదారులు తరుగును కూడా లెక్కించి డబ్బు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన తిమ్మక్క వినియోగదారుల సంఘాన్ని ఆశ్రయించింది. దుకాణదారులతో మాట్లాడిన సంఘం వారు మరి కొంత బంగారాన్ని ఆమెకు ఇప్పించారు.
అనంతపురం నగరానికి చెందిన వసుంధర నెల రోజుల క్రితం రెండు తులాల బంగారాన్ని కొనుగోలు చేసింది. అయితే, దుకాణదారులు పాత జీఎస్‌టీ ప్రకారం చార్జి చేశారు. 5 శాతం జీఎస్‌టీకి మించి ఉండడంతో రంగంలోకి దిగిన వినియోగదారుల సంఘం నాయకులు దుకాణదారులతో మాట్లాడి ఆమెకు న్యాయం చేశారు... ఇలాంటి ఘటనలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిత్యకృత్యంగా మారాయి.


