చంద్రబాబు నిర్వాకంతో ఆగిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు
సాక్షిప్రతినిధి అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రలో అత్యంత దారుణ కరువు పరిస్థితులు సంభవించింది 1995 నుంచి 2003 వరకే. రైతుల ఆత్మహత్యలు, వలసలతో పాటు గంజి కేంద్రాలు, పశువులకు గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేసి మనుషులు, పశువులు బతికితే చాలు అన్న దారుణ పరిస్థితులు ఉండేవి. అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. వీటికి పరిష్కారాలు ఒక్కరోజు కూడా అన్వేషించలేదు. 2004లో వైఎస్సార్ సీఎం అయ్యాక కరువును శాశ్వతంగా నివారించేందుకు హంద్రీ–నీవా, హెచ్చెల్సీ ఆధునికీకరణ చేపట్టారు. వలసల నివారణకు ఉపాధిహామీ చట్టాన్ని కేంద్రంతో అమలు చేయించారు. ఇప్పుడు ‘అనంత’ తలరాత మారుతోందంటే వైఎస్ చేపట్టిన సంస్కరణలే కారణమని అందరికీ తెలుసు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వాస్తవాలను మరుగునపెట్టి తామే ‘అనంత’ను ఉద్దరించామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
హంద్రీ–నీవా ప్రాజెక్టులో
చంద్రబాబు పాత్ర ఏంటి కేశవా?
హంద్రీ–నీవా ప్రాజెక్టును ఎన్టీఆర్, చంద్రబాబు ఆ తర్వాత వైఎస్సార్ చేపట్టారని కేశవ్ ప్రస్తావించారు. 1996 మార్చి 11న ఉరవకొండలో, 1999 జూలై9న ఆత్మకూరులో హంద్రీ–నీవాకు చంద్రబాబు రెండుసార్లు శంకుస్థాపన చేశారు. 1995–96 నుంచి 2003–04 వరకూ చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా ఉన్నకాలంలో హంద్రీ–నీవా కోసం బడ్జెట్‌లో రూ.190కోట్లు కేటాయింపులు చేశారు. ఇందులో రూ.24.53 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇది కూడా శంకుస్థాపనలకు, ఆఫీసు నిర్వహణకు మాత్రమే! వైఎస్ సీఎం అయ్యాక రూ.6,850 కోట్లతో ప్రాజెక్టు పట్టాలెక్కించారు. 2004–05 నుంచి 2009–10వరకూ వైఎస్ హయాంలో బడ్జెట్‌లో రూ.3,399.74కోట్లు కేటాయించారు. కేటాయింపుల కంటే రూ. 940.62 కోట్లు ఎక్కువగా అంటే రూ.4,340.36 కోట్లు ఖర్చు చేశారు. ఆపై రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో రూ.2,143.44 కోట్ల విలువైన పనులు చేశారు. 2012లోనే కృష్ణాజలాలు జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరాయి. 2014లో చంద్రబాబు మూడోసారి సీఎం అయ్యే సమయానికి మిగిలింది రూ.366.56 కోట్ల పనులు మాత్రమే. అంటే చంద్రబాబు 2004లో సీఎంగా దిగిపోయే సమయానికి హంద్రీ–నీవా పనులు ప్రారంభమే కాలేదు. 2014లో మళ్లీ సీఎం అయ్యే సమయానికి అప్పటికే ఫేజ్–1 పనులు పూర్తయ్యి జీడిపల్లికి నీళ్లొచ్చాయి. మిగిలింది రూ.366.56 కోట్ల విలువైన పనులు మాత్రమే. వాస్తవాలు ఇలా ఉంటే కేశవ్ మాత్రం చంద్రబాబు ‘అనంత’కు ఏదో చేశారనే సత్యదూరమైన వ్యాఖ్యలు చేశారు.
రాయలసీమ లిఫ్ట్‌పై కూడా
సత్యదూరమైన మాటలే
రాయలసీమ లిఫ్ట్‌తో ‘అనంత’కు ఏం ఉపయోగం.. నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాలని కేశవ్ మాట్లాడారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు ఎలా వచ్చాయో కేశవ్ బదులిచ్చి ఉంటే బాగుండేది. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను కృష్ణాడెల్లాకు ఇచ్చి, శ్రీశైలం నుంచి డెల్టాకు ఇవ్వాల్సిన నీటిని దిగువకు పంపకుండా ‘సీమ’కు వాడతామని చంద్రబాబు అప్పట్లో చెప్పారు. దీనిపై జీఓ విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. అదీ చేయలేకపోయారు. అలాగే రాయలసీమ లిఫ్ట్ ద్వారా హంద్రీ–నీవా ఫేజ్–2కు నీరిచ్చి, హంద్రీ–నీవా ద్వారా వచ్చే మొత్తం నీటిని ‘అనంత’కే ఉపయోగపడేలా చేయాలనేది ఆ ప్రాజెక్టు లక్ష్యం. అలాగే భవిష్యత్‌లో అవుకు రిజర్వాయర్ నుంచి తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల మీదుగా మిడ్‌పెన్నార్ డ్యాంకు నీటిని తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు జరిగితే ‘అనంత’ సస్యశ్యామలం అవుతుంది. పైగా రాయలసీమ లిఫ్ట్ ద్వారా 14రోజుల్లోనే శ్రీశైలంలో నీటిని తోడేయొచ్చని మాట్లాడారు. ప్రాజెక్టులోకి వరద నీరు ప్రారంభమయ్యాక 881 అడుగుల వరకు వచ్చేదాకా ఆగకుండా 800 అడుగుల నుంచి లిఫ్ట్ చేసే వెసులుబాటు ఉంది. ఓవైపు తెలంగాణ 800 అడుగుల నుంచి తోడేస్తుంటే, 881 అడుగుల వరకు నీరు వచ్చేదాకా ‘సీమ’ ఎదురుచూడాలా? అనేది కేశవ్ ఆలోచించాలి.
రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలి
‘అనంత’కు హెచ్చెల్సీ, హంద్రీ–నీవా మినహా మరో సాగునీటి వనరు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనన్ని మార్గాల ద్వారా నీళ్లు తెప్పించుకునే అవకాశాలను ఏ రాజకీయపార్టీ తీసుకున్నా దానికి తక్కిన పార్టీలు మద్దతు ఇచ్చి సాధించాలి. అప్పుడే ‘అనంత’ జనజీవనం బాగుపడుతుంది. వ్యక్తిగత రాజకీయాల కోసం ప్రాంత ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదు. రాయలసీమ లిఫ్ట్‌తో హంద్రీ–నీవా ఆయకట్టుకు పుష్కలంగా సాగు, తాగునీరు దొరకడంతో పాటు అవుకు నుంచి ఎంపీఆర్‌కు మరో కొత్త ప్రాజెక్టు నిర్మించి నీటిని తెచ్చుకునే వెసులుబాటు ఉంది.
ఇదీ.. ‘అనంత’కు చంద్రబాబు చేసిన ద్రోహం
2012లో జీడిపల్లికి కృష్ణాజలాలు వస్తే డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసి ఆయకట్టుకు నీరివ్వడమే తరువాయి. ఫేజ్–1లో 1.18లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అప్పట్లో అంతా భావించారు. 33, 34, 36 ప్యాకేజీలకు 2014కు ముందే టెండర్లు పూర్తయి పనులు మొదలయ్యాయి. అయితే కుప్పం వరకూ ప్రధాన కాలువ పూర్తయి నీరు వెళ్లేదాకా డిస్ట్రిబ్యూటరీ పనులు చేయొద్దని 2015 ఫిబ్రవరి 23న జీఓ 22ను చంద్రబాబు జారీ చేశారు. ఇదొక్క నిర్ణయం చాలు చంద్రబాబు ‘అనంత’ గొంతు కోశారని చెప్పేందుకు. ఇప్పటి వరకూ ఆ జీఓ తర్వాత డిస్ట్రిబ్యూటరీలు చేసేందుకు మరో జీఓ జారీ చేయలేదు. ఆ జీఓతో డిస్ట్రిబ్యూటరీలు ఆగిపోయాయి. 2012లోనే నీళ్లు వచ్చినపుడు 2014–19 వరకూ ఐదేళ్లలో ఎందుకు డిస్ట్రిబ్యూటరీలు చేయలేదో టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి.
‘సీమ’ సాగునీటి ప్రాజెక్టుల అంశంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల మాటల యుద్ధం
రాయలసీమ లిఫ్ట్‌తో హంద్రీ–నీవా మొత్తం నీరు ‘అనంత’ జిల్లా
వాడుకునేలా వెసులుబాటు
రాయలసీమ లిఫ్ట్ ఆపేసి చంద్రబాబు సీమకు ద్రోహం చేశారని
వైఎస్సార్‌సీపీ ఉద్యమబాట
ఈ ప్రాజెక్టుతో ‘అనంత’కు ఉపయోగం లేదని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన
వైఎస్సార్ చేపట్టిన ప్రాజెక్టును తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నం


