నాకూ బతకాలని ఉంది..! | - | Sakshi
Sakshi News home page

నాకూ బతకాలని ఉంది..!

Apr 10 2026 9:51 AM | Updated on Apr 10 2026 9:51 AM

‘అమ్మా... నొప్పి తట్టుకోలేకపోతున్నా.. ఎలాగైనా నన్ను కాపాడండి.. నాకూ బతకాలని ఉంది. నా ప్రాణాలు కాపాడండి’ అంటూ బాధతో విలవిల్లాడుతూ 14 ఏళ్ల కుమారుడు ప్రాధేయపడుతుంటే ఆ తల్లిదండ్రులకు దిక్కుతోచలేదు. మౌనంగా రోదించడం మినహా మరేమీ చేయలేని అసహాయ స్థితి. ప్రాణాంతక వ్యాధి బారి నుంచి కుమారుడిని కాపాడుకునే ఆర్థిక స్థోమత లేక నరక యాతన అనుభవిస్తున్నారు. పరిస్థితి విషమిస్తుండడంతో తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు.

బొమ్మనహాళ్‌: మండలంలోని ఉంతకల్లు గ్రామానికి చెందిన హనుమంతు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కూలి పనులతో పిల్లలను బాగా చదివించుకుంటున్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల పెద్ద కుమారుడు పవన్‌కుమార్‌ రెండు కిడ్నీలు చెడిపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

ఏడాది క్రితం గుర్తించిన వైద్యులు

ఏడాది క్రితం తన నడుము వద్ద నొప్పిగా ఉందంటూ తల్లిదండ్రులతో పవన్‌కుమార్‌ చెప్పుకుని బాధపడ్డాడు. దీంతో డబ్బు సర్దుబాటు చేసుకుని కుమారుడిని బళ్లారిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి పిలుచుకెళ్లి చూపించారు. వైద్య పరీక్షల అనంతరం ఓ కిడ్నీ పనితీరు సక్రమంగా లేదని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో చికిత్స మొదలు పెట్టినా ఆశించిన ఫలితం దక్కలేదు. ప్రతి నెలా ఆస్పత్రి చుట్టూ తిరగాల్సి వచ్చింది. రోజూ కూలి పనులకు వెళితే తప్ప పూట గడవని స్థితిలో ఉన్నా... కుమారుల చదువుల కోసమని దాచి పెట్టిన డబ్బు కాస్త చికిత్సలకు ఖర్చు పెడుతూ వచ్చారు.

సక్రమంగా పనిచేయని రెండు కిడ్నీలు

పవన్‌కుమార్‌ ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాకపోవడంతో నెల క్రితం మరోసారి బళ్లారిలోని ఆస్పత్రికి పిలుచుకెళ్లారు. సమగ్ర వైద్య పరీక్షల అనంతరం రెండు కిడ్నీలు సక్రమంగా పనిచేయడం లేదని వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులకు దిక్కుతోచలేదు. దీంతో పెద్దాస్పత్రికి వెళితే ఏదైనా ఫలితం ఉంటుందనే ఆశతో ఉడిపి వద్ద ఉన్న మణిపాల్‌ ఆస్పత్రికి పిలుచుకెళ్లారు. అక్కడ కూడా పవన్‌కుమార్‌ రెండు కిడ్నీలు పనిచేయడం లేదని, వాటిని వెంటనే మార్చాలని అక్కడి వైద్యులు సూచించారు. ఎవరైనా దాతలు సహకరించి కిడ్నీలు వితరణ చేస్తే బాలుడు బతికే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

ప్రాణభిక్ష పెట్టమంటూ..

ఇప్పటికే పవన్‌కుమార్‌ చికిత్స కోసం తల్లిదండ్రులు రూ.6.50 లక్షలకు పైగా అప్పులు చేసి ఖర్చు పెట్టారు. ఇంట్లో ఉన్న గొర్రెలు, గేదెలను అమ్మేశారు. తల్లి మెడలోని మంగళసూత్రం, ఇతర నగలను బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు సమకూర్చుకున్నారు. అయినా పూర్తి స్థాయి చికిత్స అందించేందుకు ఆర్థిక స్థోమత సహకరించడం లేదు. ఇలాంటి తరుణంలో సామాజిక మాధ్యమాలను ఆశ్రయించారు. ‘నేను బతకాలని అనుకుంటున్నా.. దాతలు సహకరించి ప్రాణభిక్షపెట్టండి’ అంటూ తల్లిదండ్రులతో కలసి పవన్‌కుమార్‌ వేడుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

సాయం చేయాలనుకునేవారు

ప్రాణాల కోసం చిన్నారి పోరాటం

14 ఏళ్లకే నరకయాతన

కిడ్నీల మార్పు అనివార్యమన్న వైద్యులు

దిక్కుతోచని స్థితిలో నిరుపేద కుటుంబం

ఆపన్నహస్తం కోసం వేడుకోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement