● నిర్వేదంలో అన్నదాతలు
● కోత కోయకుండా పొలాల్లోనే వదిలేస్తున్న వైనం
బొమ్మనహాళ్/కూడేరు: టమాటకు ధర ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పతనం అవుతుందో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు భారీగా పడిపోవడంతో రైతు కుదేలవుతున్నాడు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సహకారం అందకపోవడంతో వారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది.
మిగిలేదేమీ లేదు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు 18 వేల హెక్టార్ల విస్తీర్ణంలో టమాట పంట సాగైంది. మొక్కకు ఆసరాగా కర్ర కట్టి పండించిన టమాట కాయలు నాణ్యతగా ఉంటుండడంతో మార్కెట్‌లో డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఎక్కువ శాతం రైతులు ఈ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. ఒక ఎకరాలో మొక్కలు, బాడుగ, డ్రిప్పు, కర్రలు, దారాలు, సేద్యం, కూలీల ఖర్చులు, మందుల పిచికారీకి రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నారు. ఎకరాకు 250 నుంచి 300 బాక్సుల (బాక్సుకి 30 కిలోలు) దిగుబడి వస్తుంది. ప్రస్తుతం బాక్సు ధర రూ. 80 నుంచి రూ. 100 పలుకుతోంది. సరాసరి రూ.100 వేసుకున్నా రైతుకు రూ. 35 వేలు కూడా రావడం లేదు. దీంతో రూ. 1.20 లక్షల వరకు నష్టం వస్తోంది. రైతు కుటుంబమంతా కష్టపడి పంటకు నీరందించి సస్యరక్షణ చర్యలు చేపట్టిన క్రమంలో వారి కూలీని లెక్కకడితే చివరికి అప్పులే మిగులుతుండడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.


