సాక్షిప్రతినిధి అనంతపురం: రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాలపై రెండు ప్రభుత్వాలకు హక్కు లభించినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం జలాలను ఇష్టారాజ్యంగా వాడుకోవడం ప్రారంభించింది.శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తోడేసేలా ప్రాజెక్టులు నిర్మించింది. ఈక్రమంలో ‘సీమ’ నష్టపోకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్’ పేరుతో రూ.3,850 కోట్లతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. ఆయన హయాంలో రూ.990 కోట్ల విలువైన పనులు చేపట్టి బిల్లులు కూడా చెల్లించేశారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రాయలసీమ లిఫ్ట్‌ను నిలిపేయాలని చంద్రబాబును ఆదేశించడం, బాబు అందుకు ఒప్పుకోవడం అందరికీ తెలిసిందే! ఈ విషయాన్ని రేవంత్ స్వయంగా తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించారు. అప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ లిఫ్ట్ కోసం గ్రేటర్ రాయలసీమ నేతలు ఉద్యమిస్తున్నారు. ప్రతీ జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం అనంతపురంలో గుత్తి రోడ్డులోని కేటీఆర్ ఫంక్షన్ హాలులో సమావేశం నిర్వహించ తలపెట్టారు. కీలకమైన ఈ సమావేశానికి మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు నరేష్‌కుమార్ రెడ్డి, అసెంబ్లీ నియోజక వర్గాల సమన్వయకర్తలు హాజరు కానున్నారు.
రాయలసీమ ఎత్తిపోతల ఎందుకంటే..
శ్రీశైలం ప్రాజెక్టును ‘సీమ’వాసుల త్యాగాలతో 1981లో నిర్మించారు. 2003–04 వరకూ రోజుకు 11 వేల క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు నుంచి ‘సీమ’కు తరలించేవారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. 854 అడుగుల నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి 7 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించవచ్చు. 2004 వరకూ 9 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ రోజూ ‘సీమ’ బాగు గురించి ఆలోచించలేదు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఏకంగా 44 వేల క్యూసెక్కులకు పెంచారు. ఎంతమంది అడ్డుపడినా ఖాతరు చేయకుండా ప్రాజెక్టు పూర్తి చేశారు. రాష్ట్రం విడిపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మొదటికొచ్చినట్లైంది. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నపుడే రోజుకు 2 టీఎంసీలు తరలించుకునేలా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల చేపట్టింది. కృష్ణాజలాలు శ్రీశైలం చేరుకోక ముందే రోజుకు 8 టీఎంసీలు ఎత్తిపోసుకునేలా ప్రాజెక్టులు నిర్మించింది. ఇదే క్రమంలో కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం సామర్థ్యం కూడా 129 టీఎంసీల నుంచి 229 టీఎంసీలకు పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఇదే జరిగితే ‘సీమ’ ఎడారిగా మారే పరిస్థితి. పైగా శ్రీశైలంలో 881 అడుగుల నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులు తీసుకోవచ్చు, అంతకు తక్కువ ఉంటే పూర్తిస్థాయి నీటిని తీసుకోలేం. ఈ మొత్తం పరిణామాలను నిశితంగా పరిశీలించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మనకు రావాల్సిన నీటిని 800 అడుగుల నుంచే తీసుకునేలా పోతిరెడ్డిపాడు దిగువన ‘రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు.
ఈర్ష్యతో కేసులు..
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయితే జగన్‌మోహన్‌రెడ్డికి పేరు వస్తుందని, తన రాజకీయ మనుగడే ప్రమాదంలో పడుతుందనే ఈర్ష్యతో మహబూబ్‌నగర్ జిల్లాలోని టీడీపీ సానుభూతి పరులతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో చంద్రబాబు కేసులు వేయించారు. ఈ క్రమంలో అనుమతి తీసుకున్న తర్వాతే పనులు చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. అయితే తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ప్రాజెక్టులకు ఎన్జీటీ అనుమతి ఉందని, ఆ ప్రాజెక్టుల కిందే చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతలకు మళ్లీ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని ట్రిబ్యునల్‌లో అప్పటి ప్రభుత్వం గట్టిగా వాదించింది. ఓవైపు ఎన్జీటీ అనుమతుల కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు పనులను పరుగులు పెట్టించింది. 2024 మే వరకూ వేగంగా పనులు జరిగాయి. అప్పటికి రూ.990 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. చంద్రబాబు ప్రభుత్వం రాగానే ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది.
సాకారమైతే సస్యశ్యామలం..
రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలు సస్యశ్యామలమవుతాయి. తాగునీటి కష్టాలు తీరుతాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు మరింత మేలు జరుగుతుంది. హంద్రీ–నీవా ఫేజ్–1లో ‘అనంత’లో 1.18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఫేజ్–2లో 90,235 ఎకరాలు ఉంది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో ఫేజ్–2లో 2.02 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఫేజ్–1, 2 కింద ఉమ్మడి ‘అనంత’లో 4.11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి 40 టీఎంసీలకుపైగా నీరు అవసరం. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే ఫేజ్–2లోని వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల పరిధిలోని హంద్రీ–నీవాకు గాలేరు–నగరి ద్వారా నీరు అందిస్తారు. దీంతో అనంత నుంచి ఆ రెండు జిల్లాలకు కృష్ణా జలాలు పంపాల్సిన అవసరం ఉండదు. ఆ నీటిని మనమే వాడుకోవచ్చు. 4.11 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందించవచ్చు. అనుకున్నంత నీటిని హంద్రీ–నీవా ద్వారా తీసుకురాలేకపోవడంతో ఏటా చెరువులకు మళ్లించడం మినహా డిస్ట్రిబ్యూటరీలు చేసి ఆయకట్టుకు అందించడం లేదు. 40 టీఎంసీలు మనమే తీసుకునే పరిస్థితి వస్తే చెరువులతో పాటు ఉప, పిల్ల కాలువలు నిర్మించి పొలాలకు నీరు పారించుకోవచ్చు.
బాబు దగాపై బిగుస్తున్న పిడికిలి
రాయలసీమ లిప్ట్ సాధన కోసం ఏకమవుతోన్న ‘సీమ’ నేతలు, ప్రజలు
నేడు అనంతపురంలోని కేటీఆర్ ఫంక్షన్ హాలులో సమావేశం
‘సీమ’ను సుభిక్షం చేసేందుకు రూ.3,850 కోట్లతో పనులు
చేపట్టిన వైఎస్ జగన్
తెలంగాణలోని టీడీపీ
సానుభూతి పరులతో కేసులు
వేయించి ఆపించిన చంద్రబాబు


