అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు (ఏహెచ్‌ఏ)అక్రమంగా ఉద్యోగం పొందారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అందరి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాలని డైరెక్టరేట్ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో స్థానిక పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో గురువారం అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైంది. ప్రక్రియ పూర్తికి 10 నుంచి 15 రోజులు పట్టవచ్చని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత సమగ్ర నివేదికను డైరెక్టరేట్‌కు సమర్పించనున్నుట్లు చెబుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో 2019లో 184 మంది, 2020లో 62 మంది, 2024లో 451 మంది మొత్తంగా 697 మంది ఏహెచ్‌ఏలు నియమితుల య్యారు. రెండు, మూడో విడతలో నియమితులైన వారిలో నకిలీ సర్టిఫికెట్లు ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రూ. కోటి లూటీపై
విచారణకు వేళాయె
● నేడు జిల్లాకు విచారణాధికారి
అనంతపురం అగ్రికల్చర్: పశుసంవర్ధకశాఖలో ఎలాంటి అనుమతులు లేకుండా రూ.కోటికి పైగా సొమ్మును పక్కదారి పట్టించిన వ్యవహారంపై విచారణ మొదలు కానుంది. విచారణాధికారిగా నియమితులైన డాక్టర్ శ్రీవాస్ పిళ్లై శుక్రవారం జిల్లాకు రానున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. రూ.కోటికి పైగా ప్రభుత్వ సొమ్మును అక్రమంగా మళ్లించుకున్నట్లు వచ్చిన అభియోగాలపై ప్రాథమిక విచారణ తర్వాత ఆ శాఖ సీనియర్ అసిస్టెంట్ సుశీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఆ శాఖ విశ్రాంత జేడీ డాక్టర్ జీపీ వెంకటస్వామికి రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రూ.42 లక్షల వరకు నిలిపివేశారు. రెండు సార్లు ఆడిట్ బృందాలు విచారణ చేపట్టడంతో పాటు ఈ కుంభకోణంపై పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలోనే విచారణాధికారి రానుండటం ఆ శాఖలో గుబులు రేపుతోంది. స్థానిక పశుశాఖ ప్రాంగణంలో ఉన్న షీప్ డెవలప్‌మెంట్ భవనంలో శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు తెలిసింది. అభియోగాలు ఎదుర్కొంటున్న ఇరువురు అధికారులతో పాటు మరికొందరిని విచారణ చేసే అవకాశం ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.
డీఈఓ గుండెకు స్టంట్
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు గుండె సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరారు. గుండెకు రక్తం సరఫరా చేసే ఒకనాళం బ్లాక్ అయినట్లు గుర్తించిన వైద్యులు గురు వారం రాత్రి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో స్టంట్ వేశారు. వైద్యుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. డీఈఓ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందొ ద్దని కుటుంబ సభ్యులు, సిబ్బందికి భరోసా ఇచ్చారు. వాస్తవానికి మంగళవారం రాత్రి ఛాతినొప్పి కారణంగా ఓ ఆస్పత్రిలో చేరిన డీఈఓ నీరసంగా ఉండడంతో సైలెన్ ఎక్కించారు. బుధవారం ఉదయం మరోమారు పరీక్ష కోసం వెళ్లగా...గుండె సంబంధిత వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. అయితే అక్కడి నుంచి నేరుగా పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనం జరుగుతున్న కేంద్రానికి డీఈఓ చేరుకున్నారు. సాయంత్రం దాకా అక్కడే ఉండి రాత్రి గుండె సంబంధిత వైద్యుడిని సంప్రదించారు. వైద్య పరీక్షల్లో హృదయానికి వెళ్లే రక్తనాళంలో బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు. స్టంట్ అవసరమని స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించి స్టంట్ వేశారు. సమాచారం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు, ఉద్యోగులు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆస్పత్రికి వెళ్లి డీఈఓను పరామర్శించారు.
ఇన్‌చార్జ్ డీఈఓగా శ్రీనివాసరావు
ప్రసాద్‌బాబు అనారోగ్యం పాలైన నేపథ్యంలో అనంతపురం డీవైఈఓ శ్రీనివాసరావుకు డీఈఓ ఇన్‌చార్జ్ బాధ్యతలను అప్పగిస్తూ కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 15 రోజుల పాటు ప్రసాద్ బాబు సెలవు పెట్టారు.


