ఈ యంత్రాలు రైతు నేస్తాలు
బొమ్మనహాళ్: వరిగడ్డిని కట్టకట్టే యంత్రాలు రావడంతో రైతులకు గ్రాసం కొరతకు పరిష్కారం లభించింది. ప్రస్తుతం వరికోతకు కూలీలకు బదులుగా రైతులు పెద్దసంఖ్యలో యంత్రాలను వినియోగిస్తున్నారు. వీటితో వరిగడ్డి రైతులకు అందకుండా పోతోంది. దీంతో పశుగ్రాసం సమస్య వేధిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త వచ్చిన యంత్రం(స్ట్రా బేలర్ ) ఈసమస్యకు చెక్‌పెడుతోంది. మరోవైపు రైతులకు అదనపు ఆదాయం లభిస్తోంది.
ఎండుగడ్డి సేకరణ సులభం
స్ట్రా బేలర్ యంత్రం ఎండుగడ్డి సేకరణ సులభమైంది. ట్రాక్టర్ యజమానులు ఈ యంత్రాలను కొనుగోలు చేసి మరింత ఆదాయాన్ని పొందుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు 180 వరకు ఈయంత్రాలు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 53,549 హెక్టార్లలో వరి పంట సాగైంది. ఇప్పటికే దాదాపు 80 శాతం మేర వరి కోతలు పూర్తయ్యాయి. యంత్రాలతో కోసిన గడ్డిని స్ట్రా బేలర్ యంత్రాలతో ఒబ్బిడి చేయడం ప్రారంభించారు. స్ట్రా బేలర్ యంత్రంతో సేకరించే పొలంలో ఎకరాకు దాదాపు 1.5 టన్నుల గడ్డి లభిస్తుంది. ఒక్కో గడ్డి మోపు సుమారు 20 కేజీలు ఉంటుంది. ఇలా ఎకరాకు దాదాపు 75 వరకూ గడ్డి మోపులు లభిస్తాయి. ఒక్కోక్క గడ్డిమోపునకు రూ.35 చొప్పున పలకడంతో ఎకరాకు రూ.2,625 ఆదాయం లభిస్తుంది. గతంలో నిరుపయోగంగా మారిన ఎండుగడ్డిని ఈ స్ట్రా బేలర్ యంత్రంతో ఒబ్బిడి చేసుకుని రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు.
ఎండుగడ్డి సేకరణకు అందుబాటులోకి వచ్చిన స్ట్రాబేలర్ యంత్రాలు రైతు నేస్తాలుగా మారాయి. దీనివల్ల వారికి ఆదనపు ఆదాయం లభిస్తుంది. గతంలో మాదిరిగా పొలాల్లోని ఎండుగడ్డిని తగులబెట్టి విధానాన్ని వదిలేశారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించడంతో పాటు పశుగ్రాసం కోరత సమస్య తీరింది.
– సాయికుమార్, ఏఓ, బొమ్మనహాళ్


