పాడి రైతులూ పోటీలకు తరలిరండి : కలెక్టర్
అనంతపురం అర్బన్: రూరల్ మండలం ఆకుతోటపల్లిలో జనవరి 7, 8 తేదీల్లో ‘పాలధార’ పేరుతో నిర్వహిస్తున్న పాల దిగుబడి, దూడల ప్రదర్శన పోటీల్లో పాల్గొనేలా పాడి రైతులను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ రూపొందించిన ‘అనంత పాలధార’ పోస్టర్లను కలెక్టర్ సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో ఆవిష్కరించి, మాట్లాడారు. అధిక పాల ఉత్పత్తి, మేలుజాతి పశుపోషణపై అవగాహన కల్పించేలా విధంగా జిల్లా స్థాయి పాడి రైతుల పోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న పశుపోషకులు తమ సమీప రైతు సేవా కేంద్రాలు, పశువైద్య కేంద్రాలను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎ.మలోల, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ప్రేమ్‌చంద్, డీడీ రమేష్‌రెడ్డి, ఏడీలు రత్నకుమార్, రామచంద్రారెడ్డి, కేఎల్ శ్రీలక్ష్మి, పశువైద్యాధికారి ఎ.గోల్డ్‌స్మన్, పాల్గొన్నారు.
మూడు విభాగాల్లో పోటీలు
అనంతపురం అగ్రికల్చర్: ఆకుతోటలపల్లి వేదికగా జనవరి 7, 8, 9 తేదీల్లో మూడు విభాగాల్లో పాడి రైతులకు పోటీలు ఉంటాయని, ఈ పోటీల్లో పాడిరైతులు పాల్గొనేలా చొరవ తీసుకోవాలని సంబంధిత అధికారులను పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్ ఆదేశించారు. మంచి పాల ఉత్పత్తి సాధిస్తున్న పాడి రైతులను గుర్తించి వారి పాడి పశువులు, లేదా గేదెలను తీసుకుని పోటీల్లో పాల్గొనేలా చొరవ తీసుకోవాలన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయం నుంచి అనంతపురం, ఉరవకొండ డీడీలు, ఏడీలు, అలాగే పశువుల డాక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సంకరజాతి ఆవులు 18 లీటర్లు, దేశీయజాతి ఆవులు 6 లీటర్లు, గేదెలు 8 లీటర్ల విభాగంలోమూడు రకాల పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో గెలుపొందిన మూడు విభాగాల్లోనూ మొదటి, రెండు, మూడో బహుమతి కింద నగదు పురస్కారం ఉంటుందని తెలిపారు. 8న పాల దిగుబడి పోటీలు, 9న లేగ దూడల ప్రదర్శన, ఉచిత గర్భకోశవ్యాధి శిబిరం, 9న హుమతుల ప్రదానోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. నాణ్యమైన పశుసంపద పెంపు లక్ష్యంగా రాయలసీమలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పోటీలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.


