కారుణ్యం లేదు.. కాఠిన్యం తప్ప
అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగంలో రెవెన్యూ శాఖ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అన్ని శాఖలకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఈ శాఖ... ప్రస్తుతం తన శాఖ ఉద్యోగుల నుంచే విమర్శలను ఎదుర్కొంటోంది. ప్రధానంగా కారుణ్య నియామకాల విషయంలో జాప్యంపై.. పదోన్నతుల అంశంలో కనబరుస్తున్న నిర్దయపై రోజురోజుకూ ఉద్యోగులో అసహనం పెరిగిపోతోంది. జాప్యానికి అధికారులు చెబుతున్న... చూపుతున్న కారణాలు సహేతుకమైనవి కాదని అభిప్రాయం ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది.
కారుణ్య నియామకాలకు మోక్షం ఎన్నడో
ఓ ఉద్యోగస్తుడు మరణిస్తే ఆయన కుటుంబం దిక్కులేనిది కాకుండా ఉండేందుకు కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉద్యోగం ఇవ్వాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ శాఖలకు సంబంధించి కార్యుణ్య నియామకాలు కలెక్టర్ కార్యాలయం నుంచి జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ దాదాపు 32 మంది బాధితులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే గతంలో ఎన్నడూ లేనంతంగా కారుణ్య నియామకాల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఓ వైపు కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడంతో పోషణ భారమై ఉద్యోగం కోసం కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు.
పదోన్నతుల కల్పనలో కాఠిన్యం
ఉద్యోగుల తమ సర్వీసులో కోరుకునే అత్యంత ప్రాధాన్యతా అంశం పదోన్నతి. పదోన్నతల కల్పనలో జాప్యం నెలకొంటే ఆ ప్రభావం ఉద్యోగుల విధి నిర్వహణపై పడుతుంది. వారిలో ఉత్సాహం సన్నగిల్లి... నిరాశ నిస్పహతో పనిచేస్తుంటారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ఉద్యోగులు ఇలాంటి పరిస్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నారు. వివిధ కేడర్లలో ఖాళీగా పోస్టులకు పదోన్నతి అర్హత ఉన్న వారు ఏడాదిగా వేచి ఉన్నారు. అయితే పదోన్నతుల కల్పన నిర్ణయంపై ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో అంతులేని జాప్యం చోటు చేసుకుంటోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా మినహా రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తి కావడం విశేషం.
తప్పని ఎదురుచూపులు
సీనియర్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి పొందేందుకు ఇప్పటికే సర్వే టెస్ట్, డిపార్ట్‌మెంటల్ టెస్ట్, ఆకౌంట్ టెస్ట్, ఇతర రెవెన్యూ టెస్ట్‌లు ఉత్తీర్ణత సాధించిన జూనియర్ అసిస్టెంట్లు (జేఏ) 30 మంది ఉన్నారు. శాఖలో 32 సీనియర్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసే అవకాశం ఉన్నా... నేటికీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ప్రస్తుతం డీటీలుగా పదోన్నతి పొందేందుకు అర్హులైన 15 మంది ఎస్‌ఏలు ఉన్నారు. అయితే ఈ ప్రక్రియ నెలలుగా ముందుకు సాగకపోవడంతో వారికీ ఎదురు చూపులు తప్పలేదు.
పెండింగ్‌లో కారుణ్య నియామకాలు
ఎదురు చూస్తున్న బాధిత కుటుంబాలు
పదోన్నతుల కల్పనలో
అంతులేని నిర్లక్ష్యం
ఏడాదిగా ఎదురుచూపులకే పరిమితమైన రెవెన్యూ ఉద్యోగులు
ప్రక్రియ చేపడతాం
కారుణ్య నియాకాలు, పదోన్నతుల ప్రక్రియ తక్షణం మొదలు పెడతాం. ఇందుకు సంబంధించి అంశాలను పరిశీలించాను. కారుణ్య నియామకాల ఫైళ్లను తెప్పించుకుని వీలైనంత త్వరగా ఉద్యోగాలు కల్పిస్తాం. ఇక పదోన్నతుల విషయంలో న్యాయపరమైన చిక్కులపై సలహా అడిగాం. త్వరలోనే ఈ ప్రక్రియనూ పూర్తి చేస్తాం.
– వి.వినోద్‌కుమార్, కలెక్టర్
కారుణ్యం లేదు.. కాఠిన్యం తప్ప


