అధైర్య పడొద్దు... అండగా ఉంటాం
పుట్లూరు: అధైర్య పడొద్దు.. అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఆ పార్టీ శింగనమల నియోజకర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ భరోసానిచ్చారు. పుట్లూరు మండలం కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. కోమటికుంట్లలో టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన ఎరికలయ్య కుటుంబాన్ని, అనంతరం గరుగుచింతపల్లిలో టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన పెద్దన్న , నాగరాజును పరామర్శించారు. గ్రామంలోని పెద్దమ్మ ఆలయం వద్ద మద్యం విక్రయించరాదన్నందుకు విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు పెద్దన్న కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శైలజనాథ్ మాట్లాడుతూ... ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకు సేవ చేయాలని, అభివృద్ధి చేసి చూపించి గొప్పగా చెప్పుకోవాలి తప్ప ఇలా దాడులు చేసి పైశాచిక అనందం పొందడం భావ్యం కాదన్నారు. అధికారం ఉంది కదా అని చట్ట వ్యతిరేకంగా నడుచుకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గరుగుచింతపల్లి గ్రామంలో జరుగుతున్న పరిణామాలపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితులకు అండగా నిలుస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎంపీపీ బి.రాఘవరెడ్డి, సర్పంచ్‌లు ఓబులేసు, రామకృష్ణారెడ్డి, మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ నాగేశ్వరరావు, నాయకులు రామమోహన్‌రెడ్డి, జేఆర్‌పేట మహేశ్వరరెడ్డి, విష్ణునారాయణ, శింగనమల ప్రసాద్, పోలిరెడ్డి, వెంకటశివుడు, కృష్ణయ్య, సూరి తదితరులు ఉన్నారు.
వీరజవాన్ మురళీనాయక్
త్యాగం జాతి మరవదు
గోరంట్ల: వీర జవాన్ మురళీనాయక్ త్యాగాన్ని భరత జాతి ఎన్నటికీ మరిచిపోదని డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. సోమవారం గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకున్న ఆయన మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్‌ను పరామర్శించారు. అనంతరం వీరజవాన్ మురళీనాయక్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శత్రుమూకలతో మురళీనాయక్ సాగించిన వీరోచిత పోరాటాన్ని కొనియాడారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కుటుంబాలకు శింగనమల సమన్వయకర్త శైలజనాథ్ భరోసా


