ఆర్డీటీ పరిరక్షణకు చర్యలు : కలెక్టర్
అనంతపురం టవర్‌క్లాక్: ఆర్డీటీ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ‘సేవ్ ఆర్డీటీ’ పేరుతో చేపట్టిన రిలే నిరాహార ధీక్షలు సోమవారానికి ఎనిమిదోవ రోజు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని కలెక్టర్ సందర్శించి, అఖిలపక్ష కమిటీ సభ్యులతో మాట్లాడారు. అనంతరం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సీఎం పర్యటనలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించానన్నారు. సుధీర్ఘ కాలం పాటు పేదలకు నిస్వార్థ సేవలు అందించిన ఆర్డీటీ పరిరక్షణ అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళతానని అన్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ కోసం 8 రోజులుగా దీక్షలు చేస్తున్నారంటే మామూలు విషయం కాదన్నారు. ఓ మంచి పని కోసం ఉద్యమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. అఖిల పక్ష కమిటీ నాయకులు సాకే హరి మాట్లాడుతూ.. ఆర్డీటీ సేవలు కొనసాగేలా కలెక్టర్ చేయగలరని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే కుల, ప్రజా సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉధ్యమాలు చేపడతామన్ని అన్నారు. కార్యక్రమంలో కేపీ రాజు, కోట్ల గంగాధర్, సుగమంచి శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, ఓబులేసు, టీపీ రామన్న, అనిల్‌కుమార్, కొత్తపల్లి సురేష్, నారాయణ నాయక్, బండారు కుళ్లాయప్ప , నరసింహులు, షఫీ, వన్నూరప్ప, హరినాథరెడ్డి, గోపాలకృష్ణ, తరిమెల రాజు తదితరులు పాల్గొన్నారు.


