సేవకు ప్రతిరూపం.. స్టాఫ్‌నర్సులు
అనంతపురం మెడికల్: ప్రాణాపాయ స్థితిలో, అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు మెరుగైన సేవలందించి, వారిని మామూలు స్థితికి తీసుకురావడంలో స్టాఫ్‌నర్సులకు సాటి మరెవ్వరూ లేరు. సాధారణంగా వైద్యులు రోగిని పరీక్షించి అవసరమైన సేవలను రాసి పెట్టి వెళ్లిపోతుంటారు. ఆ తర్వాత రోగిని 24 గంటలూ కంటికి రెప్పలా చూసుకుంటూ వైద్య సేవలు అందించడంలో స్టాఫ్‌నర్సులే కీలకంగా ఉంటారు. ఈ క్రమంలోనే స్టాఫ్ నర్సుల సేవలపై ప్రజలను చైతన్యపరిచేలా ఏటా నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటలీ దేశానికి చెందిన నర్సు ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854–55లో క్రిమియాలో జరిగిన యుద్ధంలో గాయపడిన సైనికులకు విశేష సేవందించారు. ఆమె సేవలకు గుర్తుగా ఏటా మే 12న ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆస్పత్రుల్లో సోమవారం నర్సుల దినోత్సవాన్ని వైభవంగా జరుపుకునేందుకు నర్సులు సిద్ధమయ్యారు.
కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి..
జిల్లాలో 2020 మార్చి నుంచి కోవిడ్ నియంత్రణలో నర్సులు ప్రాణాలకు తెగించి సేవలు అందించారు. మొదటి మూడు దశల్లో 25,47,582 మంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకోగా, వీరిలో 1,77, 596 మంది కోవిడ్ బారిన పడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 45,327 మంది, కోవిడ్ కేర్ సెంటర్లలో 64,200 మంది చికిత్స పొందారు. అప్పట్లో ప్రభుత్వ సర్వజనాస్పత్రితో పాటు జిల్లా వ్యాప్తంగా ఆస్పత్రుల్లో దాదాపు 2,360 మందికి పైగా స్టాఫ్‌నర్సులు సాహసోపేతమైన విధులు నిర్వర్తిస్తూ కోవిడ్ బారిన పడిన వారు కోలుకునేలా చేశారు. ఈ క్రమంలో వీరిలో 20 నుంచి 30 శాతం మంది కోవిడ్ బారిన పడినా.. కోలుకున్నాక తిరిగి ధైర్యంగా విధుల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి స్టాఫ్‌నర్సుల సేవలకు గుర్తుగా రాష్ట్రస్థాయి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది.
అనంతను అగ్రస్థానంలో నిలుపుతాం
రోగులకు మెరుగైన సేవలందించడంలో స్టాఫ్‌నర్సుల పాత్ర చాలా కీలకం. క్షతగాత్రులు, ప్రాణాపాయ కేసులు, శస్త్రచికిత్సలు, సిజేరియన్, సాధారణ ప్రసవాలు తదితర సేవల్లో స్టాఫ్‌నర్సులు అంకితభావంతో పనిచేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయిలో అనంతపురం సర్వజనాస్పత్రిని ప్రథమ స్థానంలో నిలుపుతాం. – నాగమణి, గ్రేడ్ 1 నర్సింగ్
సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి
నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం
సేవకు ప్రతిరూపం.. స్టాఫ్‌నర్సులు


