మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎస్పీ జగదీష్ లిఖితపూర్వక అభ్యర్థన
అనంతపురం: హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఈ నెల 8న కుటుంబసభ్యులతో కలిసి తాడిపత్రికి వెళ్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, ఎస్పీ జగదీష్‌ను మంగళవారం పెద్దారెడ్డి కలసి హైకోర్టు ఉత్తర్వులు చూపి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ వినతిపై ఎస్పీ పి. జగదీష్ బుధవారం స్పందిస్తూ తాడిపత్రికి 8న చేరుకునే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సూచిస్తూ లేఖ రాశారు. ఈ నెల 9న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో మొత్తం భద్రతా సిబ్బంది అక్కడ విధుల్లో పాల్గొంటున్నారని, దీంతో 8వ తేదీ తర్వాత మరో రోజు నిర్ణయించుకుని తెలిపితే సరైన భద్రత కల్పిస్తామని లేఖలో పేర్కొన్నారు.
ముష్కరులపై పోరుకు నేను సైతం..
కళ్యాణదుర్గం: ముష్కరులను తుదముట్టించే దిశగా ప్రస్తుతం పాకిస్తాన్‌తో మొదలైన యుద్ధంలో పాల్గొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ ఉన్నతాధికారులకు మాజీ జవాన్, కళ్యాణదుర్గం నియోజకవర్గ సైనిక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చేకూరి అమర్‌నాథ్ లేఖ రాశారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ముస్కరులపై సాగిస్తున్న ఈ యుద్ధంపై ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఉగ్రవాదులు, వాళ్లకు సహకరించిన వాళ్లను భూమ్మీద లేకుండా చేసే పనిని త్రివిధ దళాలకు కేంద్రం అప్పగించిందన్నారు.
ఇది ఒక విధంగా మిలటరీ వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చేనట్లేనని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో తాను సర్వీసులో ఉండి ఉంటే ఎంతో గర్వంగా అనుభూతి చెందేవాడినని అన్నారు. యుద్ధంలో పాల్గొనే సైనికులకు అవసరమైన సహాయం, అవసరమైతే యుద్ధంలో పాల్గొనేందుకూ తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆర్మీ అధికారులకు లేఖ రాసినట్లు తెలిపారు.
త్రివిధ దళాల హుండీల లెక్కింపు
అనంతపురం: సాయుధ త్రివిధ దళాల పతాక దినోత్సవ సందర్భంగా వివిధ సంస్థలు, పాఠశాలలు, కళాశాలల నుంచి సేకరించిన విరాళాల హుండీ బాక్స్‌లను బుధవారం కలెక్టర్ నియమించిన కమిటీ సమక్షంలో జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో లెక్కించారు. మొత్తం 75 హుండీల ద్వారా రూ.1,09,710 నగదు, దాతల నుంచి రూ.3,76,992 కలిపి మొత్తం రూ.4,86,702 నగదు అందినట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి పి. తిమ్మప్ప తెలిపారు. ఈ మొత్తాన్ని లు త్రివిధ సాయుధ దళాల పతాక బ్యాంకు ఖాతాకు జమ చేసినట్లు వివరించారు.


