
అనంతపురం కల్చరల్: తెలుగు భాష అజంతం.. అజరామరం అని భాషాభిమానులు అన్నారు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా వ్యాప్తంగా తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతపురంలోని జిల్లాపరిషత్ సమీపంలోని తెలుగుతల్లి కూడలికి వివిధ పాఠశాలల విద్యార్థులు, భాషాభిమానులు ర్యాలీగా వెళ్లారు. అక్కడ తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి ‘మా తెలుగు తల్లికి మల్లె పూ దండ’ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా తెలుగు పరిరక్షణ వేదిక అధ్యక్షుడు బి.నారాయణ, డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి అధ్యక్షుడు రియాజుద్దీన్, కవులు, రచయితలు నానీల నాగేంద్ర, డాక్టర్ నగరూరు రసూల్, పూజారి ఈరన్న తదితరులు తెలుగుభాష ఔన్నత్యాన్ని కొనియాడారు. మాతృభాషపై ప్రేమ కలిగేలా తల్లిదండ్రులు చిన్నారులను ప్రోత్సహించాలని సూచించారు. పలు సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు తెలుగుతల్లికి నీరాజనాలర్పించారు.
భాషోద్యమ మూలపురుడు గిడుగు రామ్మూర్తి
అనంతపురం అర్బన్: వ్యవహారిక భాషోద్యమానికి మూలపురుషుడు గిడుగు రామ్మూర్తి అని కలెక్టర్ గౌతమి కొనియాడారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో గిడుగు రామ్మూర్తి జయంతి నిర్వహించారు. కలెక్టర్ పాల్గొని గిడుగు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి తెలుగు వాడుక భాష ఉద్యమానికి పితామహుడన్నారు. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చి భాషలో ఉన్న వీలును తెలియజెప్పిన మహనీయుడన్నారు. వ్యవహారిక భాషను గ్రంథరచనకు స్వీకరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. ప్రతి ఒక్కరూ గిడుగు బాటలో నడిచి తెలుగు భాషా అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ కుషాల్‌జైన్, పర్యాటక శాఖ అధికారి నాగేశ్వరెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీధర్, సూపరింటెండెంట్ పుణ్యవతి పాల్గొన్నారు.

గిడుగు చిత్రపటానికి కలెక్టర్ గౌతమి నివాళి
