పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీ ఏర్పాట్లు

Oct 16 2026 12:54 AM | Updated on Oct 16 2026 12:54 AM

● ఎన్నికల ప్రవర్తనా నియమావళి కఠినంగా అమలు ● మీడియా సమావేశంలో కలెక్టర్‌, కమిషనర్‌, ఎస్పీ వెల్లడి

స్థానిక ఎన్నికలకు

తుమ్మపాల : స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్‌ తెలిపారు. మున్సిపల్‌, స్ధానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై గురువారం కలెక్టరేట్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీలు, జీవీఎంసీ అనకాపల్లి జోన్‌ పరిధిలో ఈనెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరణ, 19న నామినేషన్ల పరిశీలన, 21న ఉపసంహరణకు చివరి తేదీ అన్నారు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామన్నారు. ఈ నెల 28న అనకాపల్లి జీవీఎంసీ జోన్‌, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల్లో పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. అవసరమైతే 29న రీపోలింగ్‌, 30న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందన్నారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ షెడ్యూల్‌ ఇలా...

ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలకు ఈ నెల 19న నోటిఫికేషన్‌ విడుదల, 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. 24న నామినేషన్ల పరిశీలన, 25న అప్పీళ్ల పరిష్కారం, 26న అప్పీళ్లపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. 27న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందన్నారు. నవంబర్‌ 3న పోలింగ్‌, అవసరమైతే 4న రీపోలింగ్‌, 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుందన్నారు.

మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు

జిల్లాలోని 642 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కొన్ని కారణాల వల్ల నాలుగు పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా పడినట్టు వెల్లడించారు. అనకాపల్లి డివిజన్‌ లోని 10 మండలాలకు తొలి విడతగా నవంబర్‌ 26న పోలింగ్‌, ఫలితాల వెల్లడి జరుగుతుందన్నారు. నర్సీపట్నం డివిజన్‌లోని 7 మండలాలకు నవంబర్‌ 29న, అడ్డరోడ్డు డివిజన్‌లోని 7 మండలాలకు డిసెంబర్‌ 2న మూడో విడత పోలింగ్‌ జరుగుతుందన్నారు. మూడు విడతల్లోనూ ఉదయం పోలింగ్‌ నిర్వహించి, మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.

అనకాపల్లి జోన్‌లో 89 పోలింగ్‌ కేంద్రాలు

జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ మాట్లాడుతూ అనకాపల్లి జోన్‌ పరిధిలోని ఆరు వార్డులకు 89 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటిని 20 రూట్లుగా విభజించినట్లు వెల్లడించారు. మేయర్‌ ఓటింగ్‌కు పింక్‌ కలర్‌ బ్యాలెట్‌ పేపర్‌, వార్డు సభ్యులు, కార్పొరేటర్ల ఓటింగ్‌కు తెలుపు రంగు బ్యాలెట్‌ పేపర్‌ వినియోగించనున్నట్లు తెలిపారు. ఇద్దరు రిటర్నింగ్‌ అధికారులు, ఇద్దరు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమించినట్లు చెప్పారు. భద్రత కోసం ఆరుగురు సెక్టార్‌ మేజిస్ట్రేట్లను నియమించామని, రావుగోపాలరావు కళాక్షేత్రం వద్ద డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

4,500 మందికి పైగా బైండోవర్‌..

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జోనల్‌ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు చేపడుతున్నామని, ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్‌, జోనల్‌ కార్యాలయం, జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అభ్యర్థులకు అవసరమైన అనుమతుల కోసం జోనల్‌ కార్యాలయంలో సింగిల్‌ విండో విధానం అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు.

ఎస్పీ తుహిన్‌ సిన్హా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు 4,500 మందికి పైగా సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి కౌన్సెలింగ్‌ ఇచ్చి బైండోవర్‌ చేసినట్టు తెలిపారు. అభ్యర్థులు నామినేషన్లు, ప్రచారం, ర్యాలీలు, సభల నిర్వహణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఓటర్లను ఎవరైనా బెదిరించినా, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. లౌడ్‌స్పీకర్ల వినియోగానికి ముందస్తు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. లైసెన్సు కలిగిన ఆయుధాల డిపాజిట్‌ ప్రక్రియ 70 శాతం పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను 24 గంటల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 112కు ఫోనన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌న్‌ పటేల్‌, జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, డిప్యూటీ సీఈవో తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement