సమస్యాత్మక వ్యక్తులపై బైండోవర్ చర్యలు
ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలి
ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు
పోలీసు సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్
అనకాపల్లి : స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. తమ కార్యాలయంలో గురువారం జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్లలో సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే అనర్హత వేటుతో పాటు, క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలను శతశాతం పారదర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలన్నారు. జిల్లాలోని అతి సమస్యాత్మక, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, గత ఎన్నికల్లో జరిగిన నేరాలు, ఘర్షణల చరిత్ర ఆధారంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సమస్యాత్మక వ్యక్తులు, రౌడీషీటర్లపై ఎవరినీ మినహాయించకుండా తక్షణమే బైండోవర్ చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్లో ఉన్న నాన్–బెయిలబుల్ వారెంట్లను త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలన్నారు. లైసెన్స్ ఆయుధాలను తక్షణమే పోలీస్స్టేషన్లో డిపాజిట్ చేయాలన్నారు. ఎంసీసీ నిబంధనలను అనుగుణంగా విగ్రహాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని ఆదేశించారు.
ఈ నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు..
వేర్వేరు పార్టీల అభ్యర్థులు ఒకే సమయంలో ఒకే మార్గంలో ర్యాలీలు నిర్వహించరాదని, ముందస్తు సమాచారం అందించి నిర్దేశించిన సమయాల్లోనే వెళ్లాలని, ఘర్షణలకు దిగితే ప్రభుత్వ విధులకు ఆటంకం కింద అరెస్టు చేస్తామని తెలిపారు.
48 గంటల ముందే అనుమతి తప్పనిసరి
సభలు, ర్యాలీలు, రోడ్ షోలకు 48 గంటల ముందే పోలీసు అనుమతి పొందాలని, ప్రచార వాహనాలకు పాస్ ఉండాలని లేని వాహనాలను ఎన్నికలు ముగిసే వరకూ సీజ్ చేస్తామన్నారు.
మైకుల వినియోగంపై పరిమితులు
ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే మైకులు వాడాలని, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాల వద్ద మైకులు నిషేధించడం జరిగిందన్నారు.
నగదు, మద్యం పంపిణీపై దృష్టి
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, నగదు బహుమతులు పంపిణీ చేయడం తీవ్రమైన నేరమని, పట్టుబడితే ఎన్నికల కమిషన్కు నివేదించి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయిస్తామన్నారు. రూ.50వేలు కంటే ఎక్కువ నగదును రవాణా చేసినట్టయితే సరైన పత్రాలు ఉండాలని, లేకపోతే తనిఖీల్లో సీజ్ చేస్తామన్నారు.


