యలమంచిలిలో జన సైనికులకు బీజేపీ షాక్
అనకాపల్లిలో నేతల తీరు గందరగోళం
నర్సీపట్నంలో ఒక కుటుంబానికేనా? అని పెదవి విరుపు
పెరిగిన రాజకీయ వేడి
సాక్షి, అనకాపల్లి : స్థానిక ఎన్నికల సందడి మరింత ఊపందుకొంది.ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో అభ్యర్థుల ఖరారుకు కాసింత సమయమే ఉండటం, వెంటనే మున్సిపల్స్, కార్పొరేషన్ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కావడంతో ఇటు అధికారులు, అటు పార్టీల ప్రతినిధులు పరుగులు తీస్తున్నారు. 24 మండలాల పరిధిలో ఉన్న అనకాపల్లి జిల్లాలో జీవీఎంసీ వార్డులు ఉండడంతో ఇటు కార్పొరేట్ స్థానాల కోసం, అటు యలమంచిలి, నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్, వార్డు స్థానాల కోసం పోటీ, ఆసక్తి, ఖరారు వంటి ప్రక్రియలో రాజకీయ వర్గాలు నిమగ్నం అయ్యాయి.
యలమంచిలిలో మారిన సమీకరణలు
టీడీపీలోనూ, వైఎస్సార్సీపీలోనూ కొనసాగి తాజాగా బీజేపీలో చేరిన తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పిళ్లా రమాకుమారి మళ్లీ పోటీలోకి రావడంతో యలమంచిలి రాజకీయం వేడెక్కింది. కూటమి సయోధ్యలో భాగంగా టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన వారిలో ఒకరికి మున్సిపల్ చైర్పర్సన్ పీఠం దక్కుతుందని భావించిన ఇరు పార్టీలకు ఝలక్ ఇచ్చేలా బీజేపీ అభ్యర్థినిగా రమాకుమారి రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో జనసేనకు చెందిన కర్రి ఝాన్సీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పోటీలో ఉంటానని, శుక్రవారమే నామినేషన్ వేస్తున్నట్టు పేర్కొన్నారు. కానీ ఈ మున్సిపాలిటీ పీఠం బీజేపీ కోరుతున్న జాబితాలో ఉండడంతో పాటు, విశాఖ డెయిరీ చైర్మన్ దివంగత ఆడారి తులసీరావు కుమార్తెగా పరిచయం ఉన్న రమాకుమారి మళ్లీ రంగంలోకి రావడంతో కూటమిలో కలకలం మొదలయ్యింది. దీనికి తోడు రమాకుమారిపై స్థానికంగా కాస్త వ్యతిరేకత మొదలుకావడంతో ఈ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని జనసేన భావించినప్పటికీ చివరి నిమిషంలో ఎటువైపు మళ్లుతుందో చూడాల్సి ఉంది.
నర్సీపట్నంలో అన్నీ వారికేనా...
నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ పీఠానికి వినబడుతున్న టీడీపీ నేత మహిళా అభ్యర్థిని పేరుతో టీడీపీ శ్రేణుల్లో కాస్త నిరాశ కనిపిస్తున్నట్టు సమాచారం. కూటమి సమీకరణల్లో భాగంగా ఇక్కడ జనసేన ఏ మాత్రం పుంజుకోకుండా టీడీపీ కీలక నేత వ్యవహరించారు. ఇప్పటికే వీరి ఇంట రెండు పదవులు ఉండగా, మూడు పదవి వీరికేనా, మిగిలిన నేతల్ని ఎదగనివ్వరా? అనే ప్రచారం అంతర్గతంగా సాగుతోంది. దీనికి తోడు జెడ్పీ చైర్పర్సన్ పీఠం కోసం రంగంలోకి దిగిన మాజీ ఎంఎల్ఏను టీడీపీ కీలక నేత అంగీకరిస్తారో..? లేదో..? వేచి చూడాల్సి ఉంది.
అనకాపల్లిలో సీట్ల లొల్లి
జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిఽధిలోని ఆరు కార్పొరేటర్ల స్థానాలకు సీటు కేటాయించే విషయంలో కూటమిలో సిగపట్లు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇక్కడ ఇద్దరు మాజీ మంత్రులు వ్యవహార శైలిపైనే అందరి దృష్టి పెట్టారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే తీరుతో రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లు కార్పొరేటర్ సీట్ల ఖరారు విషయంలో చేస్తున్న నానా యాగీ ఇక్కడి జనసైనికుల్ని రగిలిస్తుంది. ఒక సీటు కోసం వెంపర్లాడుతున్న బీజీపీకి కూడా గౌరవం లేకుండా ఇక్కడి ప్రజాప్రతినిధి కదలికలు కూటమిలో వేడిని పుట్టిస్తున్నాయి. కేవలం ఆరు కార్పోరేటర్ స్థానాలకు క్షణానికో పేరు, పూటకో మాట అన్న విధంగా వ్యవహరిస్తూ తెలుగు తమ్ముళ్లను, జన సైనికులకు, కాషాయ దళానికి చుక్కలు చూపిస్తున్నారు. కూటమిలో కొరవడిన ఐక్యతతో పోటీ చేసే వారిలో భయం వెన్నాడుతోంది.
రాజీనామాలెందుకు..?
స్థానిక ఎన్నికల ముందు మొదలైన రాజీనామాల పర్వం కూటమిలో గుబులుపుట్టిస్తుంది. మునగపాక మండలంలోని ఒక మాజీ సర్పంచ్ కూటమిని వదిలి వైఎస్సార్సీపీలో చేరడంతో రాజకీయ వేడి మొదలయ్యింది. ఇది మరవకముందే అనకాపల్లి మండలంలోని వెంకుపాలేనికి చెందిన మాజీ టీఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి, మాజీ తెలుగు యువత జిల్లా కార్యదర్శిగా పనిచేసిన పీ.గిరినాయుడు టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ నేతల వ్యవహార శైలి వల్లే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కూటమికి దెబ్బ మీద దెబ్బ తగలడం, రెబెల్స్ బెడద మొదలు కావడంతో కూటమికి బీటలు మొదలయ్యాయి. ఎంపీగా ఉన్న బీజేపీ నేత బీజేపీ నాయకులు, కార్యకర్తలకు తగిన సంఖ్యా బలంతో కూడిన సీట్లు సంపాదించకుండా టీడీపీకి అనుకూలంగా ఉన్నారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన మాజీ జిల్లా అధ్యక్షులు సైతం ఈ పరిణామాల పట్ల కినుక వహిస్తున్నారని తెలుస్తోంది. జిల్లాలో కూటమి కుమ్ములాటలు స్థానికంలో ఎటువంటి ప్రభావం చూపుతాయోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.


