● 3 నెలలుగా తిరుగుతున్నా సరి చేయని అధికారులు
రావికమతం: అధికారులు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడంతో దాన్ని సరిచేయాలని మూడు నెలలుగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ వానపల్లి నానాజీ ప్రదక్షిణలు చేస్తున్నాడు. దొండపూడి గ్రామానికి చెందిన నానాజీ కుమారుడు చాణిక్య ఆశ్వీత్ రాజమహేంద్రవరంలో పాలిటెక్నికల్ కాలేజీలో చేరాడు. అక్కడ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించగా, పద్మశాలికి చెందిన అతడికి తెలికుల కుల సర్టిఫికెట్ జారీ అయినట్టు గుర్తించి తిరస్కరించారు. దాన్ని సరి చేయాలని దరఖాస్తు చేసి మూడు నెలలు కావస్తోంది. అప్పటి నుంచి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుల ధ్రువీకరణ పత్రంలో పేరు సరిచేయాలని కోరుతున్నాడు.


