నిప్పుల గుండంలో
దక్షిణ్ ఎనర్జీ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు సజీవ దహనం
ప్రమాదం జరిగిన ప్రదేశం ఇదే
పరవాడ : ఆ తెల్లవారుజామున వారిద్దరూ ఎప్పటిలాగే తమ విధుల్లో మునిగిపోయారు. కుటుంబాలను సాకుతున్నామన్న తృప్తి, రేపటి జీవితంపై ఎన్నో ఆశలు.. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ పరిశ్రమే వారికి చితిగా మారింది. పరవాడ జేఎన్ ఫార్మాసిటీ సమీపంలోని ఇండస్ట్రీయల్ పార్క్(ఏపీఐఐసీ జోన్–3)లో గల ’దక్షిణ్ ఎనర్జీ’ పరిశ్రమలో మంగళవారం తెల్లవారుజామున సంభవించిన ఘోర అగ్నిప్రమాదం ఇద్దరు యువ కార్మికులను సజీవ దహనం చేసింది. ఈ హఠాత్పరిణామంతో అనకాపల్లి జిల్లాలోని రెండు గ్రామాలు ఒకేసారి కన్నీటి సముద్రంలో మునిగిపోయాయి.
క్షణాల్లో జరిగిన ఘోరం
ప్లాస్టిక్ పైరోలిసిస్ ఆయిల్, ఇంధన నూనెలను తయారు చేసే ఈ పరిశ్రమను గతేడాది సెప్టెంబరులోనే ప్రారంభించారు. సోమవారం రాత్రి షిఫ్ట్ విధులకు హాజరైన ఆపరేటర్ వేపాడ వెంకటేష్(34), ఫిట్టర్ బోడపు త్రినాథ్(24)లు మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో రియాక్టర్ వద్ద ప్రాసెసింగ్ పనిలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక రియాక్టర్ పైపులైన్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి షెడ్డు పైకప్పు ఎగిరిపోయింది, గోడలు బీటలు వారాయి. క్షణాల వ్యవధిలో పరిశ్రమను దట్టమైన మంటలు అలుముకున్నాయి. రియాక్టర్ వద్దే ఉన్న వెంకటేష్, త్రినాథ్‌లు తప్పించుకునే లోపే మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అనకాపల్లి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది.
గుండెలు పగిలేలా రోదనలు
ఈ ప్రమాదం సృష్టించిన బీభత్సం ఒకవైపు అయితే, మృతుల కుటుంబాల గాథలు కంటతడి పెట్టించాయి. పరిశ్రమ గేటు వద్ద తల్లిదండ్రులు, భార్య, బంధువుల రోదనలు చూసిన ప్రతి ఒక్కరి హృదయం కదిలిపోయింది.
అధికారుల సందర్శన
ప్రమాద వార్త తెలియగానే పరవాడ డీఎస్పీ మోహన్‌రావు, సీఐ భాస్కరరావులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనకాపల్లి జేసీ శౌర్యమాన్ పటేల్, ఆర్డీవో ఆయేషా, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివశంకర్‌రెడ్డి తదితరులు పరిశ్రమను సందర్శించి ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఘటనా స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించారు.
ఒక్కొక్కరికి రూ.33 లక్షలు నష్టపరిహారం
రాంకీ కమర్షియల్ హబ్‌లో ఆర్డీవో ఆధ్వర్యంలో యాజమాన్యం, పోలీసు అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. మృతి చెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.33 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, పరవాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాలకు కేజీహెచ్‌లో పోస్టుమార్టం
మహారాణిపేట: ‘దక్షిణ్ ఎనర్జీ’ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఇద్దరు కార్మికులు వేపాడ వెంకటేష్, బొడ్డాపు త్రినాథ్‌ల మృతదేహాలకు మంగళవారం కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. తెల్లవారుజామున ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోలీసులు పంచనామా పూర్తి చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


