జీతం కోసం వెళ్తే.. జీవచ్ఛవం కావాలా? | - | Sakshi
Sakshi News home page

జీతం కోసం వెళ్తే.. జీవచ్ఛవం కావాలా?

Jun 24 2026 12:35 AM | Updated on Jun 24 2026 12:35 AM

పరిశ్రమల్లో భద్రత డొల్ల..

కార్మికుల ప్రాణాలకేదీ రక్షణ?

‘ఎసైన్షియా’ ఘోరం తర్వాత

చంద్రబాబు, పవన్‌ హామీలు ఆవిరి!

కూటమి ప్రభుత్వంలో వరుస ప్రమాదాలు.. రెండేళ్లలో 20 మందికి పైగా బలి

కాగితాలకే పరిమితమైన సేఫ్టీ ఆడిట్లు.. కంటితుడుపు తనిఖీలు

సాక్షి, అనకాపల్లి/విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీ, అచ్యుతాపురం సెజ్‌ ప్రాంతాల్లో కార్మికుల భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. విధులకు వెళ్లిన కార్మికుడు సాయంత్రం క్షేమంగా ఇంటికి చేరతాడన్న గ్యారంటీ లేకుండా పోయింది. ఎంఎన్‌సీ స్థాయి పరిశ్రమల్లోనూ వరుసగా అగ్నిప్రమాదాలు, గ్యాస్‌ లీకేజీలు, రియాక్టర్‌ పేలుళ్లు చోటుచేసుకుంటుండటం పారిశ్రామిక భద్రతలోని డొల్లతనాన్ని బట్టబయలు చేస్తోంది. తాజాగా మంగళవారం పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ్‌ ఎనర్జీ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవదహనమయ్యారు. ఈ ఘటనతో గత రెండేళ్లుగా పరవాడ–అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాల పరంపర మరోసారి చర్చనీయాంశమైంది. గ్యాస్‌ లీకేజీలు, రియాక్టర్‌ పేలుళ్లు, అగ్నిప్రమాదాల రూపంలో ఇప్పటికే 20 మందికిపైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం, యాజమాన్యాలు, పర్యవేక్షణ సంస్థల వైఖరిలో మార్పు కనిపించడం లేదు.

ఎసైన్షియా తర్వాత ఏమైంది?

సెన్షియా ప్రమాదం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఘటనాస్థలికి చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సేఫ్టీ ఆడిట్లు నిర్వహించని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడతామని ప్రకటించారు. పరిశ్రమలు, ఏపీపీసీబీ అధికారులను నిలదీశారు. కానీ రెండేళ్లు పూర్తవుతున్నా పరిస్థితుల్లో గణనీయమైన మార్పు కనిపించలేదు. నాటి ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దక్షిణ్‌ ఎనర్జీ ప్రమాదం తర్వాత మళ్లీ సేఫ్టీ ఆడిట్ల అంశం తెరపైకి రావడం ప్రభుత్వ చిత్తశుద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

కాగితాలకే పరిమితమైన నివేదికలు

ప్రమాదకర రసాయన పరిశ్రమల్లో రియాక్టర్లు, పైప్‌లైన్లు, ట్యాంకర్లు, ఫైర్‌ సేఫ్టీ వ్యవస్థలను నిరంతరం తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఐఎస్‌వో ప్రమాణాలు, ఫ్యాక్టరీస్‌ చట్టం ప్రకారం ప్రతి ఏడాది సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించి నివేదిక సమర్పించాలి. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పరిశ్రమలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే నివేదికలు సిద్ధమవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కొత్త అనుమతులు, విస్తరణలు, బ్యాంకు రుణాలు, లైసెన్స్‌ రెన్యూవల్స్‌ కోసమే ఆడిట్లు నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రమాదాలపై కమిటీలు సమర్పించిన నివేదికలు కూడా ప్రజల ముందుకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

తనిఖీలు ఎక్కడ?

రిశ్రమల్లో లోపాలను గుర్తించి సరిచేయాల్సిన ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, లేబర్‌ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావుడిగా తనిఖీలు చేసి, ఆ తర్వాత మళ్లీ యథాతథ స్థితికి చేరుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జిల్లా కలెక్టర్‌ పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి భద్రతా ప్రమాణాలపై చర్చించిన నెల రోజుల్లోనే మూడు ప్రమాదాలు చోటుచేసుకోవడం అధికార యంత్రాంగం పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

రక్షణ లేని కార్మిక జీవితాలు

ప్రమాదకరమైన రియాక్టర్ల వద్ద నైపుణ్యం కలిగిన సిబ్బందికి బదులుగా కాంట్రాక్ట్‌, తాత్కాలిక కార్మికులతో పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రియాక్టర్లలో ఒత్తిడి పెరగడం, రసాయనిక చర్యలు అదుపు తప్పడం వంటి పరిస్థితులను సకాలంలో గుర్తించే నిపుణులు లేకపోవడంతో ప్రమాదాలు తీవ్రమవుతున్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అధిక లాభాల కోసం తక్కువ వేతనాలతో వలస కార్మికులను నియమించడం, వారికి తగిన శిక్షణ ఇవ్వకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోందని అంటున్నారు. భద్రతా లోపాలపై ప్రశ్నించిన కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.

ఫైర్‌ ఇంజిన్లు, అంబులెన్స్‌లు ఎక్కడ?

రవాడ ఫార్మాసిటీ, అచ్యుతాపురం సెజ్‌లలో కలిపి 300కు పైగా పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి పరిశ్రమ వద్ద అగ్నిమాపక వ్యవస్థలు, అత్యవసర వైద్య సదుపాయాలు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉండాలి. కానీ ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడంలో జాప్యం జరుగుతోంది. చాలా కంపెనీల్లో అత్యవసర వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లు, సమర్థవంతమైన ఫైర్‌ ఫైటింగ్‌ వ్యవస్థలు లేకపోవడం బయటపడుతోంది. దీంతో తీవ్రంగాా గాయపడిన కార్మికులు ఆసుపత్రికి చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

సమాధానం చెప్పాల్సింది ఎవరు?

ప్రమాదం జరిగిన ప్రతిసారీ పరిహారాలు ప్రకటించడం, కమిటీలు వేయడం, విచారణలు జరపడం పరిపాటిగా మారింది. కానీ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? గత నివేదికలపై ఏ చర్యలు తీసుకున్నారు? సేఫ్టీ ఆడిట్ల ఫలితాలు ఏమయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం రావడం లేదు. ఎసెన్షియా నుంచి దక్షిణ్‌ వరకు జరిగిన ప్రమాదాల పరంపర ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ పేరుతో కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టలేరు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు.. ప్రమాదం జరగకుండా చూసే వ్యవస్థను నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులు, యాజమాన్యాలపై ఉంది. లేకపోతే జీతం కోసం వెళ్లిన కార్మికుడు జీవచ్ఛవంగా తిరిగి రావాల్సిన దుస్థితి మరింత విషాదకరంగా మారుతుంది.

కూటమి ప్రభుత్వంలో

వరుస ప్రమాదాల పరంపర

2024 ఆగస్టు 21: అచ్యుతాపురం సెజ్‌లోని ’ఎసైన్షియా అడ్వాన్స్‌డ్‌ ఫార్మా’లో జరిగిన భారీ పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘోర ఘటనలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

2025 జూన్‌: ’సాయి శ్రేయస్‌ ఫార్మాస్యూటికల్స్‌’లో హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ గ్యాస్‌ లీక్‌ కావడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించారు.

2025 సెప్టెంబర్‌: ’డెక్కన్‌ రెమెడీస్‌’లో మెథనాల్‌ గ్యాస్‌ లీక్‌ అయి మరో కార్మికుడి ప్రాణాన్ని బలిగొంది.

2026 జనవరి: అచ్యుతాపురంలోని ’ఎస్వీఎస్‌ కెమికల్స్‌’లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పినప్పటికీ ఆస్తి నష్టం సంభవించింది.

2026 జూన్‌ 23: పరవాడ ఫార్మాసిటీలోని ’దక్షిణ్‌ ఎనర్జీ’ కెమికల్‌ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవదహనమవడం పారిశ్రామిక భద్రతపై మళ్లీ పెను ప్రశ్నలు లేవనెత్తింది.

రెండేళ్లుగా వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు పారిశ్రామిక భద్రతా విభాగాల వైఫల్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement