నాతవరం: జిల్లాలో ఈఏడాది ఖరీఫ్ సీజన్‌లో 60వేల హెక్టార్లలో వరి సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి తెలిపారు. మండలంలోని మర్రిపాలెం రైతు సేవా కేంద్రంలో మంగళవారం రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా రైతులకు ఖరీఫ్ సాగులో మెళకువలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో రైతులకు పంపిణీ చేసేందుకు 21 వేల క్వింటాళ్ల పది రకాల వరి విత్తనాలు సిద్ధం చేసినట్టు చెప్పారు. రైతు సేవా కేంద్రాలు, పీఏఎసీఎస్‌ల ద్వారా జిల్లా వ్యాప్తంగా రైతులకు ఇంతవరకు 12,560 క్వింటాళ్లు పంపి ణీ చేసినట్టు తెలిపారు. ఖరీఫ్‌లో వరి సాగుకు 19,600 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమన్నారు. జూన్ నెలకు సంబంధించి అవసరమైన 3,789 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్‌లు, ప్రైవేట్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రైవేట్ డీలర్లు అధిక రేట్లకు విక్రయిస్తే మా దృష్టికి తీసుకురావాలన్నారు. నాతవరం మండలంలో జిల్లాలోనే అధిక విస్తీర్ణంలో వరి సాగు చేస్తుండడంతో అందుకు తగినట్టుగా వరి విత్తనాలు, ఎరువులు అధికంగా కేటాయించినట్టు తెలిపారు. గత ఏడాది జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాక సిద్ధం చేశామని చెప్పారు. రైతన్న మీ కోసం కార్యక్రమం ఈనెల 22నుంచి 27 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థిఽతులు ఏర్పడితే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. తక్కువ నీటితో పండే రాగులు, అపరాలు తదితర ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. యూరి యా, డీఏపీ తదితర ఎరువులు విడతల వారీగా రైతులకు అందిస్తామన్నారు. ఖరీఫ్ ీసీజన్‌లో అందరికీ ఒకేసారి ఎరువులు అవసరం కావడంతో రైతులు ముందుగానే కొనుగోలు చేసుకుని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి జి.సుగుణ, వెర్రిగెడ్డ నీటి సంఘం అధ్యక్షుడు అల్లు స్వామినాయుడు, మర్రిపాలెం పెద్ద చెరువు నీటి సంఘం అధ్యక్షుడు రంభా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


