అనకాపల్లి : ఈ ఏడాది విద్యార్థులకు పరీక్షలు ముగిసాయి, వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థులు, చిన్న పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెలవుల్లో సరదా కోసం పిల్లలు ప్రమాదకరమైన జలాశయాల వద్దకు వెళ్లకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. పిల్లలు సరదాగా ఈత కొట్టడానికి, స్నానాల కోసం సమీపంలోని చెరువులు, బావులు, కాలువలు, సముద్ర తీరం, నీటి కుంటల వద్దకు వెళ్లే అవకాశం ఉంటుందని, నీటి లోతు తెలియక, ప్రవాహ వేగానికి లోనై ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉంటుందని, అందువల్ల తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా అటువైపు వెళ్లనివ్వకూడదన్నారు. పిల్లలు ఇంటి వద్ద ఉన్న సమయంలో వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఉంటున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, మధ్యాహ్నం వేళల్లో పిల్లలు బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండేలా జాగ్రత్తలు వహించాలన్నారు. నీటి ప్రమాదాల వల్ల కలిగే నష్టాలను, గతంలో జరిగిన విషాద సంఘటనలను పిల్లలకు వివరించి వారిలో అవగాహన పెంచాలన్నారు. సెలవుల్లో పిల్లలను ఆటపాటలు, కథల పుస్తకాలు చదవడం, వేసవి శిక్షణ శిబిరాల వైపు మళ్లించడం ద్వారా వారి సమయాన్ని సురక్షితంగా ఉపయోగకరంగా గడిపేలా చూడాలన్నారు. సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు, స్థానికులు అలల ఉధృతిని గమనించాలని, హెచ్చరిక బోర్డులు ఉన్న చోట నీటిలోకి దిగరాదని సూచించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, ఏదైనా అత్యవసర పరిస్థితి, ప్రమాదం సంభవిస్తే వెంటనే డయిల్ 100/112కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు.


