తుమ్మపాల : అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ’నెట్ జీరో హెల్తీ క్యాంపస్’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, జిల్లాలో 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ప్రిన్సి పాళ్లు, సంబంధిత జిల్లా అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్టళ్లలో వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడం, ’జీరో వేస్ట్’ (వ్యర్థాలు లేకుండా చేయడం) లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల కంపోస్ట్ పిట్లు, సోక్ పిట్లు, కిచెన్ గార్డెన్స్ వంటి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. జూన్ 2026 నుండి జూలై 2027 మధ్యలో ఈ పనులన్నీ పూర్తి చేసి, క్యాంపస్‌లను ’నెట్ జీరో’గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హార్టికల్చర్ శాఖ, జిల్లా అధికారులు, కేజీబీవీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు కీలక పాత్ర పోషించాలన్నారు. కిచెన్ వ్యర్థాల నుంచి ఎరువును తయారు చేసేలా డీకంపోజింగ్ యూనిట్లు, చెత్త సేకరణకు టూ–బిన్ విధానాన్ని అమలు చేయడం, వర్షపు నీటి సంరక్షణ ద్వారా భూగర్భ జలాలను రీఛార్జి చేయడం, మురుగు నీటి నిర్వహణకు సోక్ పిట్స్ ఏర్పాటు చేయడం, విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రమైన వంటశాలలు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడం వంటి అంశాలపై సమీక్షించారు.


