నేడు 550 మందితో అప్పన్న దర్శనం
కొమ్మాది/ఏయూక్యాంపస్: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు, ప్రపంచవ్యాప్తంగా భక్తియోగం, శ్రీకృష్ణ తత్వాన్ని ప్రచారం చేస్తున్న పరమపూజ్య జయపతాక స్వామి మహారాజ్ మంగళవారం నగరానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం జయపతాక స్వామీజీ 550 మంది సన్యాసులతో కలిసి శ్రీలక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం లోక కల్యాణం, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఇస్కాన్ భక్తులతో కలిసి భారీ ఆధ్యాత్మిక ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ ఆర్.కె. బీచ్ నుంచి ప్రారంభమై పార్క్ హోటల్ వరకు కొనసాగుతుంది. సాయంత్రం ఎంజీఎం పార్క్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సంగీత విభావరి, భజన, కీర్తన కార్యక్రమాల్లో స్వామీజీ పాల్గొంటారు. అలాగే ఇస్కాన్‌లో రెండు రోజుల పాటు శ్రీకృష్ణ లీలలపై ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో నగరవాసులు, భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఇస్కాన్ విశాఖపట్నం అధ్యక్షుడు సాంబాదాస్ ప్రభూజీ కోరారు.


