మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే..

Apr 9 2026 7:53 AM | Updated on Apr 9 2026 7:53 AM

ఆయనది జర్నలిజం కాదు బ్రోకరిజం
విశాఖలో ఆంధ్రజ్యోతి–ఏబీఎన్‌ కార్యాలయం ఎదుట భారీ నిరసన మహిళలను కించపరిచే రాతలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ పోలీసుల అడ్డంకుల మధ్య కొనసాగిన శాంతియుత ఆందోళన

నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, సమన్వయకర్త లు కరణం ధర్మశ్రీ, కె.కె.రాజు, వాసుపల్లి గణేష్‌, పార్టీ శ్రేణులు

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తీరుపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం

మహారాణిపేట: జర్నలిజం విలువలను తుంగలో తొక్కి, బ్రోకరిజమే వృత్తిగా మార్చుకున్న ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ తీరుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు కన్నెర్ర చేశాయి. ‘కొత్త పలుకులు’ పేరుతో ఆయన రాస్తున్న ‘చెత్త పలుకులు’ మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ విశాఖలోని ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని పార్టీ నేతలు బుధవారం ముట్టడించాయి. వైఎస్సార్‌సీపీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కె.కె.రాజు, బొడ్డేడ ప్రసాద్‌ ఆధ్వర్యంలో పోర్టు హాస్పిటల్‌ జంక్షన్‌ వద్ద భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్‌ కార్యాలయం వైపు దూసుకువెళ్తున్న పార్టీ శ్రేణులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నప్పటికీ, నేతలు రహదారిపై బైఠాయించి రాధాకృష్ణ వైఖరిని పార్టీ నేతలు ఎండగట్టారు. రాధాకృష్ణ తన రాతల ద్వారా మహిళలను కించపరిచారని, తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి పత్రికలు కేవలం చంద్రబాబు అజెండాను అమలు చేసే సాధనాలుగా మారాయని, బాబు నోటి నుంచి వచ్చే మాటలనే వీరు రాతలుగా రాస్తున్నారని ఆరోపించారు.

ఆ రాతలు అత్యంతం నీచం : మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు

వేమూరి రాధాకృష్ణ ఇటీవల రాసిన కథనాలు అత్యంత నీచంగా ఉన్నాయి. మహిళలను అవమానించేలా రాయడం అసహ్యకరం. వారి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ రాతలపై రాధాకృష్ణ వెంటనే మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీడియా వేదికలను ఉపయోగించుకుని సమాజంలో విభేదాలు సృష్టించడం సరికాదు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ల మెప్పు కోసమే రాధాకృష్ణ ఇలాంటి కథనాలు రాస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్యానికి చేటు. మహిళల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆంధ్రజ్యోతి పత్రికలోనే క్షమాపణ చెబుతూ స్పష్టమైన వివరణ ప్రచురించాలి.

అసత్య ప్రచారాలు ఆయన నైజం :

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ గుడివాడ అమర్‌నాథ్‌

జర్నలిస్టుగా సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన వేమూరి రాధాకృష్ణ, తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ తప్పుడు ప్రచారాలకు వ్యతిరేకంగా మేము శాంతియుత నిరసనలు కొనసాగిస్తాం. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ప్రాజెక్టులపై విషప్రచారం చేయడం దారుణం. దేశంలోనే అతిపెద్ద స్కామ్‌ అమరావతి ప్రాజెక్ట్‌ అయితే, మరోవైపు మావిగన్‌ ప్రాజెక్ట్‌ రాష్ట్రానికి అతిపెద్ద గ్రోత్‌ కారిడార్‌గా నిలుస్తుంది. అమరావతిలో కేవలం రూ. 4 వేలకే అయ్యే పనులకు రూ. 14 వేలు ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాలే కనిపిస్తే, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేశారు. రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలు చేయడం జర్నలిజం విలువలకు విరుద్ధం.

అంతా ముక్తకంఠంతో ఖండించాలి: వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌

‘వేమూరి రాధాకృష్ణ చేస్తున్న రాతలు పూర్తిగా అసత్యాలతో కూడినవి. ప్రజలను తప్పుదారి పట్టించేలా కథనాలు రాయడం జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇవ్వడమే. మీడియా తన బాధ్యతను గుర్తుంచుకుని వ్యవహరించాలి. ఇలాంటి బాధ్యతారాహిత్య రాతలను సమాజం ముక్తకంఠంతో ఖండించాలి. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కొనసాగితే ప్రజాస్వామ్యయుతంగా బలమైన ప్రతిఘటన ఎదురవుతుంది.

అది బూతుల కరపత్రం:

మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

దెయ్యాలు వేదాలు వల్లించినట్లు రాధాకృష్ణ తనకు తోచినట్లు రాతలు రాస్తున్నారు. ఎల్లో మీడియాలో ఆయన ఒక ’ఎల్లో టెర్రరిస్ట్‌’. ఆంధ్రజ్యోతి అనేది ఒక బూతుల కరపత్రంలా మారింది. కేవలం చిల్లర కోసం రాధాకృష్ణ ఇన్ని వేషాలు వేస్తున్నారు. మహిళా లోకాన్ని కించపరిచిన ఆయనను రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు.

మహిళల గౌరవానికి భంగం :

మాజీ ఎంపీ బి.సత్యవతి

రాధాకృష్ణ వ్యాఖ్యలు యావత్‌ మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయి. ఆయన వెంటనే మహిళలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. అదే పత్రికలో వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement