నేలరాలిన మామిడి రైతు ఆశలు | - | Sakshi
Sakshi News home page

నేలరాలిన మామిడి రైతు ఆశలు

Apr 9 2026 7:53 AM | Updated on Apr 9 2026 7:53 AM

● అకాల వర్షాలు, ఈదురుగాలుల దెబ్బ ● జీడి, మామిడికి తీవ్ర నష్టం ● ఆందోళనలో రైతులు

చోడవరం : మామిడి, జీడిమామిడి పంటలకు దెబ్బమీద దెబ్బ తగిలింది. సీజన్‌ ప్రారంభం నుంచీ పొగమంచు విపరీతంగా పడడంతో ఈసారి మామిడి పూతే అంతంతమాత్రంగా పూచింది. పిందె దశ నుంచి కాయ దశకు వచ్చి ఇప్పుడు పక్వాని వచ్చిన సమయంలో మంగళ, బుధవారాల్లో ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురవడంతో పంట చాలా మేర దెబ్బతింది. దీనితో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చోడవరం నియోజకవర్గంతోపాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుంది. ఈ ఏడాది మొదట్లో పూత బాగా వచ్చినప్పటికీ వర్షాలు కురవకపోవడంతో పొగమంచు కమ్ముకుంది. మంచువల్ల చాలామేర పూత రాలిపోయింది. దీనితో ఆలస్యంగా పిందెలు వచ్చాయి. అందుకే ఉగాది పండగకు ఆశించిన మామిడి కాయలు దిగుబడి కాక చాలా గిరాకీగా అమ్మాయి. 50శాతమే ఇప్పుడు తోటల్లో కాయలు ఉన్నాయి. కనీసం ఆ పంటైనా చేతికి వస్తే పెట్టుబడులైనా వస్తాయని రైతులు ఆశించారు. ఇప్పుడు కాయదశ నుంచి పక్వానికి చేరుకున్న సమయంలో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం మామిడి రైతులను నిండా ముంచేసింది. పెద్ద ఎత్తున గాలులు వీయడంతో కాయదశలో ఉన్న మామిడి పంట చాలా మేర నేలరాలిపోయింది.

చోడవరం, అనకాపల్లి, మాడుగుల, దేవరాపల్లి, కె.కోటపాడు, బుచ్చెయ్యపేట ప్రాంతాల్లో ఉన్న తోటల్లో మామిడికాయలు నేలరాలిపోయింది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి తోటలు లీజుకు తీసుకున్న రైతులు, స్వతహాగా తోటలు కాపు కాస్తున్న రైతులు ఈ అకాల వర్షం, గాలులతో తీవ్రంగా నష్టపోయారు. గాలులు గట్టిగా వీయడంతో నేలరాలిన కాయలన్నీ పగిలి పోయాయి. కనీసం అమ్మకానికి కూడా వీలులేకుండా పంటనష్టం జరిగింది. ఈ సీజన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మామిడి రైతుల ఆశలు నిరాశలయ్యాయి.

పెట్టుబడి పోయింది

గాలివానకు పెట్టుబడి కూడా పోయింది. నేను తోటకూరపాలెం గ్రామంలో 3 ఎకరాల మామిడి తోట లీజుకి తీసుకున్నాను. ఈ ఏడాది ఏదో కొంత పంట పండింది. ఇప్పుడిప్పుడే కాయదశ నుంచి పక్వానికి చేరింది. కాయ పెరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గాలివాన వచ్చింది. గాలి భీకరంగా రావడంతో చెట్లకు ఉన్న కాయంతా నేలరాలిపోయింది. సుమారు రూ.లక్షా 40వేలు పెట్టుబడి పెట్టాను. పంట చాలా వరకు రాలిపోయింది. దీంతో పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. ఈ రాలిపోయి దెబ్బతిన్న కాయలు ఎవరూ కొనరు, తెగనమ్ముకోవడం తప్ప చేసేదేం లేదు. బాధిత మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

– వెంకటరమణ, మామిడిరైతు, తోటకూరపాలెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement