పేరు లేని ప్రశంస సంతకం లేని గౌరవం | - | Sakshi
Sakshi News home page

పేరు లేని ప్రశంస సంతకం లేని గౌరవం

Apr 8 2026 8:14 AM | Updated on Apr 8 2026 8:14 AM

● తూతూమంత్రంగా శతాబ్ది సాహితీ మహోత్సవం ● కవులకు, సాహితీవేత్తలకు అవమానం ● పేర్లు, సంతకాలు లేకుండా ప్రశంసా పత్రాల అందజేత

విశాఖ సిటీ: వందేళ్ల ఉత్తరాంధ్ర విద్యా కుసుమ ఘన వైభవం పాలకుల చేతుల్లో అభాసుపాలవుతోంది. శతాబ్ది ఉత్సవాల వేళ దేదీప్యమానంగా వెలిగిపోవాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతోంది. శత జయంతి పండగను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన పాలకులు.. తూతూ మంత్రం వ్యవహారంగా మార్చేశారు. శతాబ్ది ఉత్సవాల పేరుతో ఏడాది క్రితం నుంచి సమీక్షలు, సమావేశాల పేరుతో హడావుడి చేసిన అధికారులు.. ఇప్పుడు కార్యక్రమాల నిర్వహణలో ఘోరంగా విఫలమవుతున్నారు. మంగళవారం జరిగిన శతాబ్ది సాహితీ మహోత్సవం ఇందుకు నిదర్శనం. కవులను, కళాకారులను గౌరవించాల్సిన చోట వారికి అవమానం జరగడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.

పేర్లు, సంతకాలు లేకుండా ప్రశంసాపత్రాలు

శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఏయూలోని శ్రీ రామనేని కోదండ రామయ్య భవనంలో శతాబ్ది సాహితీ మహోత్సవాన్ని నిర్వహించారు. దీనికి అనేక మంది కవులు, అవధానులు తరలివచ్చారు. భాషాభిమానంతో వచ్చిన వారికి ఏయూ అధికారులు ఇచ్చిన బహుమతి చూసి అందరూ అవాక్కయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందజేసిన ప్రశంసా పత్రాలపై కనీసం గ్రహీత పేరు కూడా లేకపోవడం గమనార్హం. ఎవరి పేర్లు లేకుండా ఖాళీగా ‘ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్‌’ అన్నట్లు పత్రాలు అందజేయడంపై అందరూ విస్తుపోయారు. పేర్లు లేకపోగా.. అలాగే ఆ పత్రాలపై కనీసం వైస్‌ ఛాన్సలర్‌ సంతకం కానీ, ఇటు తెలుగు విభాగాధిపతి సంతకం కానీ లేకపోవడం మరింత విశేషం. ఖాళీ కాగితాలను చేతిలో పెట్టి పంపించడం పట్ల సాహితీవేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర అవమానంగా భావిస్తున్నారు.

నిర్లక్ష్యానికి పరాకాష్ట

ఈ శతాబ్ది ఉత్సవాల కోసం 2025 నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పాలకులు గొప్పలు చెప్పుకున్నారు. తీరా సమయం వచ్చేసరికి కనీసం ఒక సర్టిఫికెట్‌ కూడా సరిగ్గా సిద్ధం చేయలేని స్థితిలో ఉండడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. అతిథులకు ఇచ్చే గౌరవ పత్రాలపై బాధ్యతాయుతమైన అధికారుల సంతకాలు లేకపోవడం ఏయూ చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోనుంది.

దిగజారుతున్న ప్రతిష్ట

ఏయూ శతాబ్ది ఉత్సవాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులు గర్వపడేలా ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రతి కార్యక్రమంలోనూ ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. రాజకీయ జోక్యం ఒకవైపు, అధికారుల అలసత్వం మరోవైపు వర్సిటీని పట్టి పీడిస్తున్నాయి. శతాబ్ది ఉత్సవాల నిర్వహణలో ఇంతటి ఘోర తప్పిదాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఇప్పటికై నా పాలకులు మేల్కొని, మిగిలిన కార్యక్రమాలనైనా గౌరవప్రదంగా నిర్వహించాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement