వాట్సాప్‌ గొడవలే ప్రాణం తీశాయి | - | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ గొడవలే ప్రాణం తీశాయి

Mar 21 2026 5:06 AM | Updated on Mar 21 2026 5:06 AM

ఎంవీపీకాలనీ: నగరంలోని ఇసుకతోట రామాలయం సమీపంలో జరిగిన బొచ్చు వెంకటేష్‌ హత్య కేసులో ఎనిమిది మంది నిందితులను ఎంవీపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను ద్వారకా ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి శుక్రవారం సాయంత్రం ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. యువకుల మధ్య తలెత్తిన ఘర్షణలు, వాట్సాప్‌ గ్రూపుల్లో ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకోవడం వంటి కారణాలే ఈ హత్యకు దారితీసినట్లు ఆయన తెలిపారు. హత్య కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) పల్లా అనిల్‌కుమార్‌ది హెచ్‌బీ కాలనీ. గతంలో ఆటోమోటివ్‌ కూడలి వద్ద జరిగిన హత్య కేసుతో పాటు మరో హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌లో అతనిపై రౌడీషీట్‌ కూడా ఉంది. అనిల్‌ గత కొంతకాలంగా రణస్థలంలో నివాసముంటూ ఆటో నడుపుకుంటున్నాడు. అయితే, అప్పుడప్పుడు నగరానికి వస్తూ స్థానిక యువకులతో గ్రూపులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో హత్యకు గురైన వెంకటేష్‌, గాయపడిన సంతోష్‌లతో అనిల్‌కు తగాదాలు ఏర్పడ్డాయి. వీరిద్దరిని అంతం చేసేందుకు అనిల్‌ ఇద్దరు మైనర్లతో పాటు వెంకటేష్‌ (ఏ2), నాగేంద్ర (ఏ3), రాజేష్‌ (ఏ4), చరణ్‌ (ఏ5), నిశాంత్‌ (ఏ6)లతో కలిసి పథకం రచించాడు. ఇసుకతోట కూడలి దరిలో పథక రచన చేసిన అనంతరం.. బొచ్చు వెంకటేష్‌ రామాలయం వద్ద ఉన్నాడని తెలుసుకొని మారణాయుధాలతో అక్కడికి చేరుకున్నారు. అతనిపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం బాకి సంతోష్‌ ఇంటికి వెళ్లారు. సంతోష్‌ భార్య వరలక్ష్మి, స్నేహితుడు చందులను కొందరు అడ్డుకోగా, అనిల్‌, ఏ2 వెంకటేష్‌ సంతోష్‌పై కత్తి, ఇనుప రాడ్డుతో దాడి చేశారు. సంతోష్‌ భార్య, స్నేహితుడు పెనుగులాటలో పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులు పారిపోయారు. పసల చందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, 10 బృందాలుగా ఏర్పడి నిందితులందరినీ పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎంవీపీ సీఐ ప్రసాద్‌, ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు, ఎస్‌ఐలు అసిరి తాత, డీడీ నాయుడు, భవ్య, సీతారాం, ఏఎస్‌ఐ ఆదిరాజు పాల్గొన్నారు.

పోలీసుల చొరవ అభినందనీయం

ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఎంవీపీ పోలీసులు స్పందించిన తీరుపై ఏసీపీ హర్షం వ్యక్తం చేశారు. సీఐ ప్రసాద్‌తో పాటు ఎస్‌ఐలు నాయుడు, సీతారాం కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. అంబులెన్స్‌ కోసం వేచి చూడకుండా, పెట్రోలింగ్‌ జీప్‌లో వెంకటేష్‌ను, సీఐ ప్రసాద్‌ తన జీప్‌లో సంతోష్‌ను ఎక్కించుకొని మెడికవర్‌ ఆసుపత్రికి తరలించారు. సంతోష్‌కు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో, అతనికి అవసరమైన ‘ఓ పాజిటివ్‌’ రక్తాన్ని సైతం అందుబాటులోకి తెచ్చారు. వారి చొరవ కారణంగానే సంతోష్‌కు ప్రాణాపాయం తప్పిందని ఏసీపీ పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి, డీసీపీలు మెడికవర్‌ ఆసుపత్రికి చేరుకొని సంతోష్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం సంతోష్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ ఘటనలో ఎంవీపీ పోలీసుల చొరవ అభినందనీయమని నరసింహమూర్తి వెల్లడించారు.

తప్పుడు స్నేహాలతో

జీవితాలు నాశనం

మొదటి నుంచీ నేరచరిత్ర ఉన్న పల్లా అనిల్‌ గురించి పూర్తిగా తెలియకపోవడంతోనే నిందితుల్లో పలువురు యువకులు ఈ హత్యకేసులో ఇరుక్కున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఎనిమిది మంది నిందితుల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారికి ఎలాంటి నేరచరిత్ర లేదు. కేవలం ఆధిపత్య పోరు కోసం అనిల్‌ వారిని రెచ్చగొట్టి, ఈ దారుణానికి ప్రేరేపించాడనే అభిప్రాయం కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యక్తమవుతోంది. ఇలాంటి రౌడీషీటర్లతో స్నేహం చేసే విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. క్షణికావేశం, అనవసర ఉత్సాహం వల్ల నేరాల్లో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏసీపీ నరసింహమూర్తి హితవు పలికారు.

హత్య కేసులో ఎనిమిది మంది

నిందితుల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement