● పొలాల్లోకి చేరిన నీరు ● నేలరాలిన జీడి, మామిడి కాయలు ● దెబ్బతిన్న కూరగాయల పంటలు | - | Sakshi
Sakshi News home page

● పొలాల్లోకి చేరిన నీరు ● నేలరాలిన జీడి, మామిడి కాయలు ● దెబ్బతిన్న కూరగాయల పంటలు

Mar 22 2026 1:48 AM | Updated on Mar 22 2026 1:48 AM

● పొలాల్లోకి చేరిన నీరు ● నేలరాలిన జీడి, మామిడి కాయలు ● దెబ్బతిన్న కూరగాయల పంటలు

బుచ్చెయ్యపేట : మండలంలో కురిసిన భారీ వర్షానికి మినుము,పెసర,నువ్వులు,జనుము ఇతర పంటలు దెబ్బతిన్నాయి. బుచ్చెయ్యపేట,దిబ్బిడి, భీమవరం,ఎల్‌.బి.పురం,బంగారుమెట్ట,లోపూడి,శింగవరం,పీడీ పాలెం తదితర గ్రామాల్లో నువ్వు,జనుము చేలు నేలకొరిగాయి. పొలాల్లోకి నీరు చేరడంతో పంట కుళ్లిపోయి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు. పొలాల్లో ఆరబెట్టిన మినుము,పెసర చేలు తడిసిపోయాయి. దీంతో వాటిని రక్షించుకునేందుకు అన్నదాతలు శ్రమిస్తున్నారు. ఈదురు గాలులకు పలు గ్రామాల్లో జీడి,మామిడి కాయలు నేల రాలాయి. టమాటా,వంగ,మిరప,బీర,బెండ తదితర కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల్లో చెట్లు విరిగి పడడంతో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

దేవరాపల్లి: మండలంలో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం దంచి కొట్టింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈదురు గాలుల ధాటికి స్థానిక కుమ్మరి వీధిలో అప్పారావు అనే వ్యక్తి ఇంటిపై కొబ్బరి చెట్టు విరిగిపడింది. దీంతో డాబా పిట్ట గోడ పాక్షింగా దెబ్బతింది. మండల వ్యాప్తంగా పలు చోట్ల విద్యుత్‌ తీగలపై చెట్ల కొమ్మలు విరిగిపడటంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 5 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సరఫరాను పునరుద్ధరించే పనుల్లో విద్యుత్‌ సిబ్బంది నిమగ్నమయ్యారు. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పంట పొలాల్లో భారీగా నీరు చేరింది.జీడి, మామిడి, టమాటా తదితర పంటలకు నష్టం వాటిల్లింది. సరుగుడు, పామాయిల్‌ ఇతరాత్ర పంటలకు ఈ వర్షం వల్ల మేలు జరిగింది.

మాడుగుల, మాడుగుల రూరల్‌: మండలంలో కురిసిన భారీ వర్షానికి సుమారు 4 వేల ఎకరాల్లో జను ము, నువ్వులు, పొద్దుతిరుగుడు,పెసర, మినుము, పిల్లి పెసర, బొబ్బర్ల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు బోరుమంటున్నారు. చింత కాయలు నేల రాలి పాడైపోయాయి. కె.జె.పురం, ముకుందపురం, వంటర్లపాలెం, ఎం.కోటపాడు, వల్లాపురం, మాడుగుల, పప్పుచెట్టి చెరువు, వీరవల్లి, వీరనారాయణం, చింతలూరు, గాదిరాయి తదితర గ్రామాల్లో అపరాలు పంటకు నష్టం వాటిల్లింది. అరటిచెట్లు నేలకొరిగాయి. మామిడి, జీడిమామిడి పిందెలు నేలరాలాయి. ఈదురు గాలులకు వరికుప్పలు, గడ్డివాములు ఎగిరిపోయాయి.

కూలిన భారీ వృక్షం

కోటవురట్ల: ఈదురు గాలులు, భారీ వర్షానికి యండపల్లి మెయిన్‌రోడ్డులో భారీ వృక్షం నేలకొరిగింది. శుక్రవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు మెయిన్‌రోడ్డును ఆనుకుని ఉన్న భారీ చింత చెట్టు శనివారం తెల్లవారు జామున వేళ్లతో సహా నేలకొరిగింది. దీంతో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. తెల్లవారు జాము సమయం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే విద్యుత్‌ శాఖసిబ్బంది సరఫరాను నిలుపుదల చేశారు. చెట్టు రోడ్డుకు అడ్డుగా కూలిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ప్రధాన రహదారి కావడంతో శనివారం వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేయడంతో విద్యార్థులు ఆటోలను ఆశ్రయించాల్సివచ్చింది. వేరే రహదారిలో ఆటోల్లో రాకపోకలు సాగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement