చోడవరం: గంజాయి కేసులో ఓ నిందితుడికి పదేళ్ల కఠిన కారాగారా శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించిందని ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. వివరాల్లోకి వెళితే...గంజాయి రవాణా చేస్తుండగా 2015 జులై 16వతేదీన చోడవరం సమీపంలో విజయనగరం జిల్లాకు చెందిన కోరుకొండ అప్పలపాత్రుడు ఎలియాస్ రాజు (32)ను పట్టుకుని, 175 కిలోలను, రవాణాకు వినియోగించిన లారీ, మోటారు సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి చోడవరం ఎస్‌ఐ రమణయ్య కేసు నమోదు చేశారు. చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం.హరినారాయణ ఈ కేసులో వాదనలు విని, నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేశారు. 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ. లక్ష జరిమానా విధించారు. జరిమానా చెల్లించలేని పక్షంలో రెండేళ్లపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేయగా ఎ 2గా ఉన్న కిల్లో బాబూరావు ఇప్పటికీ పరారీలో ఉండటంతో ఎన్‌బీడబ్ల్యూ అమలు చేసి ఆ నిందితునిపై వేరే కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. మిగతా నిందితులపై వాదనలు జరిగాయి. ఇందులో ఎ1గా ఉన్న కోరుకొండ రాజుకి శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు చెప్పినట్టు ఎస్పీ తెలిపారు. కేసును అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీపురపల్లి సూర్యనారాయణ అన్ని వివరాలు కోర్టుకు అందించడంతో నేరం రుజువైందని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నేరస్తునికి శిక్ష పడేలా అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన వారందరికీ ఎస్పీ అభినందనలు తెలిపారు. మాదకద్రవ్యాలు రవాణా, వినియోగం చేసే వారిని ఎవరినీ వదిలిపెట్టేదిలేదని ఎస్పీ హెచ్చరించారు. ప్రత్యేక నిఘా వ్యవస్థతో నేరస్తులను పట్టుకుంటామని ఆయన తెలిపారు.


