స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు అధికారులు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు అధికారులు కృషి చేయాలి

Mar 18 2026 8:11 AM | Updated on Mar 18 2026 8:11 AM

● కలెక్టర్‌ విజయ కృష్ణన్‌

తుమ్మపాల: స్వర్ణాంధ్ర–2047 సాధనలో భాగంగా నిర్ణయించిన పది సూత్రాలపై అధికారులు ప్రత్యేక దృష్టితో కార్యాచరణ చేపట్టాలని, జిల్లాను అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ అన్నారు. ఇటీవల సీఎం ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల అమలుపై ఆమె మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి బేసిక్‌ ఫ్యామిలీ ఎమెనిటీస్‌ అందేలా చూడడంతో పాటు కమ్యూనిటీ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపర్చాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో రోడ్డు కనెక్టివిటీ పెంచడం, డ్రైనేజ్‌ నెట్‌వర్క్‌ మెరుగుపరచడంతో పాటు వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెత్త నుంచి సంపద తయారీ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయాలన్నారు. మార్గదర్శి– బంగారు కుటుంబం పథకం కింద ఫ్యామిలీ కార్డు ద్వారా కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల ప్రభుత్వ సేవలు అందేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్‌ పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మరింత నాణ్యతతో అమలు చేయాలన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం పెంచాలని సూచించారు. నైపుణ్య యాప్‌ వినియోగం పై యువతకు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసి, ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు. బాల్య వివాహాల నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జలధార స్కీమ్‌ అమలు చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని, రిజర్వాయర్‌ ఫిల్లింగ్‌, వాటర్‌ హార్వెస్టింగ్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాల యాలు, వార్డుల్లో ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. పీఎం సూర్యఘర్‌, పీఎం కుసుమ్‌ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో రైతు బజారు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్మార్ట్‌ కిచెన్‌ ప్లాన్‌ యాక్షన్‌ రూపొందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, జిల్లా రెవెన్యూ అధికారి వై సత్యనారాయణ రావు, సీపీవో రామారావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement