ఇసుక ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
చోడవరం : ఆర్టీసీ బస్సు అతివేగంగా నడపడంతో ముందు వెళుతున్న ఇసుక ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గురువారం జరిగిన ఈ ప్రమాదం అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే...సింహాచలం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు చోడవరం కాంప్లెక్స్ నుంచి వయా వెంకన్నపాలెం, సబ్బవరం మీదుగా విశాఖపట్నం ఆర్టీసి కాంప్లెక్స్‌కు బయలుదేరింది. అడ్డూరు సమీపంలోకి వచ్చే సరికి ముందు వెళుతున్న ఇసుక ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేయబోతూ అదుపు తప్పి ఆ ట్రాక్టర్ వెనుక భాగాన్ని బస్సు ఢీకొట్టింది. అతివేగంగా వెళుతున్న బస్సు ఒక్కసారిగా ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో బస్సు ముందుభాగం కొంతమేర నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. కొందరు ప్రయాణికులు బస్సులో ఉన్న సీట్లు, ఇనుప రాడ్లను ఢీకొట్టుకొని 10 మంది వరకూ గాయపడ్డారు. గాయపడిన డి.చంద్రబోసు, సిహెచ్.దేవి, వారాడ వెంకటసత్యనారాయణ, కె.భవానీ, యు.బాలరాజు చోడవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇళ్లకు వెళ్లిపోయారు. మరో ఐదుగురు ప్రయాణికులు ప్రమాద స్థలం నుంచి ఆటోల్లో అనకాపల్లిలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందారు. అకస్మాత్తుగా ప్రమాదానికి గురికావడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురై పెద్దగా కేకలు వేశారు. అటుగా వెళుతున్న వాహనదారులంతా వచ్చి బస్సులో గాయపడిన ప్రయాణికులను కిందికి దింపి 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి క్షతగాత్రులను కొందరిని చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి, కొందరిని అనకాపల్లిలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చోడవరం పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే ఎస్‌ఐ జోగారావు తన సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకొని ప్రయాణికులకు ధైర్యం చెప్పి మరో బస్సులో వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రదేశమంతా ప్రయాణికుల ఆర్తనాదాలతో నిండిపోయింది. బస్సు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి సీఐ అప్పలరాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ జోగారావు చెప్పారు.
ఇసుక ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఇసుక ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు


