గర్నికం పాఠశాలలో డీఈవో ఆకస్మిక తనిఖీ
రావికమతం : మండలంలో గర్నికం పాఠశాలను గురువారం డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో జిఎఫ్‌ఎల్‌ఎన్ (గ్యారెంటీ ఫండ్‌మెంటల్ లీటరసీ అండ్ న్యూమరసీ)48వ రోజు కార్యక్రమంలో భాగంగా నాలుగో తరగతి విద్యార్థులతో సొంతంగా కథ రాయిస్తున్న ఉపాధ్యాయుల పనితీరును చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో ప్రతి విద్యార్థికి తెలుగు, ఇంగ్లిషు, గణితం పాఠ్యపుస్తకాలపై చదవడం, రాయడంపై కనీస అవగాహన ఉందా, లేదా అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా డైట్ విద్యార్థులతో సర్వే నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ సర్వేలో జిల్లా వ్యాప్తంగా 1060 పాఠశాలలకు 70 పాఠశాలల్లో మాత్రమే విద్యార్థులు చదవడం, రాయడం చేయగలుగుతున్నారని, 80 పాఠశాలల్లో మధ్యంతరంగా ఉన్నారని, మిగిలిన 910 పాఠఽశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం రాదని గుర్తించామని, ఆ విద్యార్థుల విద్యా స్థాయి పెంపొందించడానికి 75 రోజుల ప్రణాళికను సిద్ధం చేసి, జీఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం అమలు చేస్తున్నామని చెప్పారు. పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం 100 రోజుల ప్రణాళికను అన్ని హైస్కూళ్లలో అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో తదితరులు పాల్గొన్నారు.


