
ఈ సారైనా న్యాయం జరిగేనా ..?
మాకవరపాలెం:
ఏళ్లతరబడి సాగులో ఉన్న రైతులకు ఈసారైనా న్యాయం జరుగుతుందో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాగుదారుల సర్వే జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడం.. చోటా నాయకుల జోక్యంతో నిజమైన సాగుదారులు ఆందోళనచెందుతున్నారు. మండలంలోని రాచపల్లి రెవెన్యూలోని 737 సర్వే నంబర్‌లో 1,604 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని 50 ఏళ్లకుపైగా సమీప గ్రామాలకు చెందిన వందల మంది రైతులు జీడి, మామిడి, ఇతర పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పట్టాల కోసం అనేక సార్లు వినతులు ఇచ్చారు. అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలూ చేపట్టారు. కానీ పట్టాలు అందలేదు.
పరిశ్రమల పేరుతో సర్వే..
ఈ ప్రాంతంలో ఏపీఐఐసీ ఆధీనంలో ఉన్న 290 ఎకరాల భూమితోపాటు సర్వే నంబర్ 737లో ఉన్న మరో 400 ఎకరాలను పరిశ్రమల స్థాపనకు కేటాయించేందుకు ఇటీవల సర్వే చేపట్టారు. రెవెన్యూ సిబ్బంది చేసిన సర్వేలో 406.87 ఎకరాలు 466 మంది సాగులో ఉన్నట్టు గుర్తించి, జాబితాలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో సాగుదారుల ఎంపికపై గురువారం రాచపల్లిలో గ్రామసభ నిర్వహిస్తామని తెలిపిన రెవెన్యూ అధికారులు, అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ జాబితాలను రాచపల్లి సచివాలయం, యరకన్నపాలెం, రామన్నపాలెం గ్రామాల్లో ప్రదర్శించి, అభ్యంతరాలను రెవెన్యూ కార్యాలయంలో తెలపాలని తహసీల్దార్ వెంకటరమణ సూచించారు.
ఫిర్యాదుల వెల్లువ
జాబితాలపై సాగుదారుల నుంచి ఫిర్యాదు వెల్లువెత్తుతున్నాయి. సాగులో ఉన్నా జాబితాలో పేర్లు లేవని కొందరు, సాగులో ఎక్కువ భూమిఉన్నా తగ్గించి నమోదు చేశారంటూ కొందరు పిర్యాదు చేశారు. సాగుదారుల జాబితాలో బినామీలను చేర్చి పరిహారం కాజేసేందుకు కొందరు చూస్తున్నారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వారం రోజుల క్రితం ఆరోపించారు. సాగుదారుల ఎంపిక వివరాలపై సమాచార హక్కు చట్టం ద్వారా తహసీల్దార్‌కు ఆయన దరఖాస్తు చేశారు. స్థానికంగా ఉన్న టీడీపీ చోటా నాయకుడు చెప్పినట్టుగా వీఆర్వో, సచివాలయ సర్వేయర్ ఇష్టం వచ్చినట్టు సాగుదారుల ఎంపికలో అనర్హులను చేర్చారని బీజేపీ నేత అడిగర్ల రాంబాబు, మరి కొందరు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా ఈ ఫిర్యాదులు కొనసాగుతూనే ఉన్నాయి. 13 ఏళ్ల క్రితం పట్టాల పంపిణీ కోసం సర్వే చేయగా అనర్హుల పేర్లు అధికంగా ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో సుమారు 100 మందికిపైగా పట్టాల పంపిణీ నిలిపివేశారు. తీరా ఇప్పుడు పట్టాలు లేని సాగు భూములకు ప్రభుత్వం పరిహారం అయినా ఇస్తుందని ఎదురు చూస్తున్న నిజమైన సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. సాగులో లేని వారి పేర్లను జాబితాలో చేర్చడంతో మరోసారి నష్టపోమని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా గ్రామసభను కూడా అందుకే వాయిదా వేశారని సాగుదారుల్లో చర్చ సాగుతోంది.
రీ సర్వే చేయాలి
737 సర్వే నంబర్ భూముల్లో రీ సర్వే చేయాలి. ఇప్పటికే చేసిన సర్వేలో అనర్హులను జాబితాలో చేర్చి, అర్హులైన పేదల పేర్లను తొలగించారు. కలెక్టర్ స్పందించి రీ సర్వే చేపట్టి, అర్హులకు న్యాయం చేయాలి. లేకుంటే ఆందోళన చేస్తాం.
– అడిగర్ల రాంబాబు, బీజేపీ నేత, రాచపల్లి
భూమి మాది.. పేర్లు వేరొకరివి
40 ఏళ్లకుపైగా సుమారు ఎనిమిది ఎకరాల్లో సాగులో ఉన్న మా భూమిని వేరొకరి పేరున సర్వే జాబితాలో చేర్చారు. తనకు జరిగిన అన్యాయంపై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఆ భూమే మాకు ఆధారం. న్యాయం చేయకుంటే చావే శరణ్యం.
– కిల్లాడ లక్ష్మి, వెంకయ్యపాలెం

ఈ సారైనా న్యాయం జరిగేనా ..?

ఈ సారైనా న్యాయం జరిగేనా ..?