
గతమెంతో ఘనం.. నేడు జ్ఞాపకం
మాడుగుల కోట.. దసరా ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించిన సంస్థానం. గుర్రపు స్వారీ చేసి, కత్తి తిప్పే సాహసవీరులకు.. వేడుకలకు శోభ చేకూర్చే కళాకారులకు ఆలవాలం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడి సందడిని ఆస్వాదించేవారు. కథలు కథలుగా చెప్పుకునేవారు. కానీ అదంతా గత వైభవం.. గతించి‘పోయిన’ బంగారు కాలం. ఇప్పుడవన్నీ జ్ఞాపకాలుగా మిగిలాయి. కానీ ఇప్పటికీ దసరా వేడుకల్లో నాటి చిహ్నాలు కనిపిస్తున్నాయి.
మాడుగుల: మాడుగుల కోట ఒకనాటి జయపూర్ సంస్థానంలోనిది. విజయదశమి వేడుకలకు వేదికగా నిలిచింది. మహరాజుల కాలంలో దేశ విదేశాల నుంచి కళాకారులు వచ్చేవారు. ఇతర రాజవంశాలకు చెందిన యువరాజులు వచ్చి ఇక్కడ కోట ప్రాంగణంలో నిర్వహించే చిత్ర విచిత్ర కత్తి, కర్ర సాములు, గుర్రపు పందాలు తిలకించేవారని గ్రామ పెద్దలు చెబుతున్నారు. యుద్ధాలలో వాడే ఆయుధాలతో జమ్మి చెట్టు నరికి దేవీ తల్లీ ఆలయంలో పూజలు నిర్వహించేవారు. ఇలా నిర్వహించడం వలన యుద్ధాలలో విజయం వరిస్తుందని అప్పటి మహరాజుల నమ్మకం. యుద్ధ విద్యల్లో తర్ఫీదు పొందడానికి మాడుగుల పట్టణంలో కోట చుట్టూ రా జగన్నసావిడి, రాజులు సావిడీలతోపాటు ఐదు సావిడులు ఉండేవి. నాటి సంప్రదాయాలను సివిల్, ఆర్టీసీ, ఆటో మోటారు యూనియన్ వారు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. బస్సు యజమానులతో పాటు వాటిలో పనిచేసే డ్రైవర్లు పుప్పాల నారాయణమూర్తి, దేవరాపల్లి నారాయణ, ఇల్లపు గంగునాయుడు, బోర కాళిదాసు నేడు కీలక పాత్ర వహిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ఎస్‌పీఎల్ రమణ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు కొనసాగాయి. అతని అనంతరం కుక్కర మోదకొండ, ద్రాక్షారపు త్రినాథ్‌లు నిర్వహించారు. ప్రస్తుతం ఆ ర్టీసీ, ఆటో మోటార్ యూనియన్ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో అదే సంప్రదాయాలతో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలుత పాత బస్టాండ్‌లో దేవీ తల్లి తాటాకుల పాకలో కొలువై ఉండేది. అంచలంచెలుగా ఆలయంతోపాటు మండపాల నిర్మాణం చేపట్టారు. అలనాటి మాడుగుల మహరాజులు యుద్ధాలలో వాడిన కత్తులను ఈనాటికీ తహసీల్దార్ కార్యాలయంలో భద్రపరిచారు. దసరా రోజు వాటిని శుభ్రపరిచి దేవీ ఆలయంలో పూజలు అనంతరం కోట మీదుగా సంబరాలు చేసుకుంటూ తిరిగి తహసీల్దార్ కార్యాలయానికి చేరుస్తారు.
బంగారు, వెండి ఆభరణాలతో వెలిగిపోతున్న మాడుగులలోని దేవీ తల్లి
వంశపారంపర్యంగా కత్తిసాము
మాడుగుల దసరా ఉత్సవాలలో మహరాజుల కాలం నుంచి మా ముత్తాతలు, తాతలు, తండ్రుల నుంచి కత్తి సాము కర్ర, సాములు ప్రదర్శనలు ఇస్తున్నాము. యుద్ధాలలో విజయం సాధించే విధంగా తర్ఫీదు ఇచ్చేవారని మా తాతలు చెబుతుండేవారు. ప్రస్తుతం ఐదుగురుం మాత్రమే ఉన్నాము. ఆనాటి రాజులు వాడిన కత్తులతోనే సాము తిప్పుతున్నాము. –ఆది చినరాజబాబు, కత్తి సాము కళాకారుడు, మాడుగుల
మాడుగుల సంస్థానంలో
దసరా వేడుకలకు ఎంతో విశిష్టత
సుదూర ప్రాంతాల నుంచి వచ్చి
సందర్శకులు తిలకించిన చరిత్ర
నాటి సందడి కనుమరుగైనా
నేటికీ కొనసాగుతున్న సంప్రదాయాలు
సివిల్, ఆర్టీసీ, ఆటో మోటారు యూనియన్ ఆధ్వర్యంలో
విజయదశమి వేడుకలు

గతమెంతో ఘనం.. నేడు జ్ఞాపకం

గతమెంతో ఘనం.. నేడు జ్ఞాపకం

గతమెంతో ఘనం.. నేడు జ్ఞాపకం