
అంబేడ్కర్ ‘స్మృతి’ని చెరిపేస్తారా?
● రాష్ట్రాన్ని అమ్మేస్తారా?
● కూటమి తీరుపై
వైఎస్సార్ సీపీ నేతల ఆగ్రహం
● మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్
అనకాపల్లి: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, దళితులపై దాడులు, విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే యత్నాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా కమిటీ మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ విభాగం నియోజకవర్గ సీనియర్ నాయకుడు దండ జ్ఞానదీప్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి స్థానిక రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయం నుంచి నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జంక్షన్‌లో డాక్టర్ బి.అర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు, వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వలన పేద విద్యార్థులు మెడికల్ విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో విజయవాడలో డాక్టర్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, స్మృతివనాన్ని నిర్మిస్తే ఆ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కూటమి ప్రభుత్వం ధారాదత్తం చేయడం అన్యాయమన్నారు. పేద విద్యార్థులకు మెడికల్ విద్యను అందించాలని రాష్ట్రవ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణం ప్రారంభించగా.. 7 మెడికల్ కళాశాలలు అందుబాటులోనికి వచ్చాయని, మిగిలిన 10 మెడికల్ కళాశాలలు 80 శాతం పనులు పూర్తయ్యాయని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పీపీపీ పేరిట మెడికల్ కళాశాలలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేస్తే, కాసులకు కక్కుర్తిపడి సీఎం చంద్రబాబునాయుడు ఈ రంగాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం అన్యాయమన్నారు. పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పిల్లి అప్పారావు మాట్లాడుతూ మెడికల్ కళాశాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వలన రిజర్వేషన్ సౌకర్యాలు అందవని, ఎస్సీ కులస్తులు మెడికల్ విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు పాలనలో దళిత కులస్తులకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతోందన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి నియోజకవర్గాల ఎస్సీ సెల్ అధ్యక్షులు పెట్ల నాగేశ్వరరావు, వంగలపూడి గణేష్, మంద రాము, 80, 84 వార్డు ఇన్‌చార్జ్‌లు కె.ఎం.నాయుడు, కోరుకొండ రాఘవ, పార్టీ సీనియర్ నాయకులు బొడ్డేడ శివ, కొణతాల మురళీకృష్ణ, హైమావతి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్ ‘స్మృతి’ని చెరిపేస్తారా?