
అమ్మో.. బస్సు ఎక్కలేం!
సాక్షి, అనకాపల్లి/అనకాపల్లి టౌన్: దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల తాకిడి పెరగడంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. సొంతూళ్లకు వెళ్లే వారితో బస్టాండ్‌లు రద్దీగా మారాయి. ప్రస్తుతం ఉన్న ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రత్యేక సర్వీసుల కింద హైదరాబాద్, విజయవాడకు నడపడంతో లోకల్ సర్వీస్ బస్సులు మరింత రద్దీగా మారాయి. మరోవైపు సీ్త్రశక్తి పథకం అమలు తర్వాత మహిళా ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు అదనపు బస్సు సర్వీసులను నడపడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి శాపంగా మారింది. మహిళలు ఉచిత పథకం ద్వారా ప్రయాణించడానికి వేచి ఉన్నా .. బస్సులు రద్దీగా ఉండడంతో ప్రైవేట్ వాహనాల్లోనే డబ్బులు చెల్లించుకుని వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. దసరా పండగ సందర్భంగా ప్రైవేట్ బస్సులు, వాహనాల్లో టికెట్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. అయినా తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ సర్వీసుల్లోనే ప్రయాణికులు వెళ్తున్నారు.
అరకొర బస్సులతో అవస్థలు
అనకాపల్లి నుంచి ఎక్కువగా విశాఖపట్నం, విజయనగరం, గాజువాక ప్రాంతాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే గ్రామీణ ప్రాంతాలైన పాయకరావుపేట, చోడవరం, దేవరాపల్లి, మాడుగుల, రావికమతం, తంతడి, పూడిమాడక, వై.లోవ, వెంకటాపురం తదితర గ్రామాల నుంచి అనకాపల్లికి నిత్యం ప్రజలు ప్రయాణిస్తుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే సమీపంలోని బైపాస్ రోడ్‌కు వెళ్లి ఎక్స్‌ప్రెస్ బస్సులను అందుకుంటారు. అరకొర బస్సు సర్వీసులతో ఇప్పటికే అవస్థలు పడుతున్న ప్రయాణికులకు ఇక దసరా పండగకు ఊరెళ్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. బస్సులో సీటు దొరికిందంటే లాటరీ తగిలినట్టు ఫీలైపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. పండగ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో పిల్లలతో సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సు ప్రయాణం ఉచితం కావడంతో మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. అయితే సరిపడా బస్సు సర్వీసులు లేకపోవడంతో సీట్ల కోసం ఫీట్లు తప్పడం లేదు. నిల్చునే ప్రయాణాలు సాగిస్తున్నారు. గమ్యస్థానాలకు చేరాలని మహిళలు సైతం ఫుట్‌పాత్‌లపైనే ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు.
జిల్లాలో బస్సు సర్వీసుల వివరాలు
అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంకు సూపర్ లగ్జరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రత్యేక సర్వీసులుగా మార్చారు. అనకాపల్లి డిపోలో 90 బస్సులు ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్‌లు 4, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు 18, సిటీ ఆర్డనరీ 4, పల్లెవెలుగు 64 బస్సులున్నాయి. దసరా సందర్భంగా అనకాపల్లి నుంచి 20 ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. వీటిని పాయకరావుపేట, చోడవరం, నర్సీపట్నం, విజయనగరం మార్గాల్లో నడుపుతున్నారు. నర్సీపట్నం డిపోకు కూడా అదనంగా 20 స్పెషల్ సర్వీసులు పెంచారు. ఇందులో విశాఖ–నర్సీపట్నం 10, విజయవాడకు–2, హైదరాబాద్–1, మిగిలిన 7 బస్సులు లోకల్ సర్సీసులకు కేటాయించారు. దీనిపై ఆర్టీసీ అనకాపల్లి డిపో అధికారి ప్రవీణను సంప్రదించగా.. దసరా నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. రద్దీకి తగ్గట్టు ప్రత్యేక సర్వీసులను పెంచామని చెప్పారు. ముందస్తుగా బుక్ చేసుకుంటే భవానీ భక్తులకు ఎక్స్‌ప్రెస్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో అందుకు తగ్గట్టు బస్సులను సర్దుబాటు చేస్తున్నామన్నారు.
ఆర్టీసీపై దసరా ప్రభావం రద్దీకి తగ్గట్టు బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు ప్రమాదకరంగా ఫుట్‌బోర్డు ప్రయాణాలు
గంటల తరబడి నిరీక్షించాల్సిందే
దసరా పండగ నేపథ్యంలో బస్సులు కిటకిటలాడుతున్నాయి. బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. రద్దీ పెరిగిపోవడంతో బస్సులు ఆలస్యంగా నడుస్తున్నాయి. బస్సు ఎక్కే సమయంలో కూడా తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. దసరా వరకు పోలీసుల సమక్షంలో క్యూలో బస్ ఎక్కే విధంగా ఏర్పాట్లు చేయాలి.
– ఆర్.మంగనాయుడు, కొత్తపేట
ప్రైవేట్ సర్సీసులే దిక్కు..
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులు లేకపోవడంతో సొంత గ్రామాలకు వెళ్లాలంటే ప్రైవేట్ సర్వీసులే దిక్కవుతున్నాయి. ఆటోలు, టాటా మేజిక్, ఇతర సర్వీసుల డ్రైవర్లు డబుల్ చార్జీలు వసూళ్లు చేస్తున్నారు. అదనపు సర్సీసులను నడుపుతున్నట్టు కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువగా బస్సులు నడపాలి.
– గొనగాన చిన్నోడు, తట్టబంద

అమ్మో.. బస్సు ఎక్కలేం!

అమ్మో.. బస్సు ఎక్కలేం!

అమ్మో.. బస్సు ఎక్కలేం!