
సమస్యల పరిష్కారం కోసం పీహెచ్‌సీ వైద్యుల ధర్నా
అనకాపల్లి: జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీ) విధులు నిర్వహిస్తున్న వైద్యుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యుల అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు వి.కనక అప్పారావు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఎదుట మంగళవారం అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పీహెచ్‌సీ వైద్యులు నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించాలని, టైమ్ బాండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు బేసిక్ పే 50 శాతం ట్రైబుల్ అలవెన్స్ మంజూరు చేయాలని కోరారు. నోషనల్ ఇన్‌క్రిమెట్స్ మంజూరు చేయాలని, చంద్రన్న సంచార చికిత్స ప్రొగ్రామ్ కింద వైద్యులకు రూ.5 వేలు అలవెన్స్ అందజేయాలని, నేటివిట్, అర్బన్ ఎలిజిబిలిటీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు వినోద్, వెంకటేష్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.