
చివరి మజిలీకి ఎన్ని కష్టాలో..
పెద్దేరు నది నీటిలో నుంచి మృతదేహాన్ని మోసుకెళ్తున్న కుటుంబ సభ్యులు
బుచ్చెయ్యపేట: మండలంలో వడ్డాది మేజర్ పంచాయతీలో మృతదేహాన్ని ఖననం చేయడానికి బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడ్డారు. సోమవారం వడ్డాదిలో కొత్తూరుకు చెందిన ముత్యాల గణేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. దళితులు, దేవాంగులు, స్వర్ణకారు లు, కమ్మర్లకు చెందిన శ్మశానవాటిక ఇక్కడ మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఎస్సీ బాలుర వసతి గృహం ఎదురుగా పెద్దేరు నది ఒడ్డున ఉంది. గతంలో పెద్దేరు కస్పా కాలువపై సిమెంట్ గొట్టాలు పరిచి రోడ్డు వేశారు. ఈ రోడ్డుపై వెళ్లి మృతదేహాలను ఖననం చేసేవారు. ఇటీవల వర్షాలకు సిమెంట్ గొట్టాల రోడ్డు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. నడుం లోతు నీటి లో నుంచి అతికష్టం మీద శ్మశాన వాటిక వరకు మృతదేహాన్ని మోసుకెళ్లి ఖననం చేశారు. ఇప్పటికై నా శ్మశాన వాటికకు వెళ్లే రహదారిని బాగు చేయడమే కాక వేరే దగ్గర తమ కులాల వారు అంత్యక్రియల నిర్వహణకు స్థలం కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.