
బొమ్మల కొలువు.. సంస్కృతికి నెలవు
సాంకేతికత ఎంత పెరిగినా.. కృత్రిమ మేధతో అద్భుతాలు చేస్తున్నా..
అంతరిక్షానికి వెళ్లొచ్చినా కొన్ని సంప్రదాయాలు ఎప్పటికీ పాతబడవు..
చూడ్డానికీ బాగుంటాయి.. ఆనందాన్నీ ఇస్తాయి. అలాంటిదే దసరా బొమ్మల కొలువు..
మన సంస్కృతీ, సంప్రదాయాలను సజీవంగా నిలుపుతున్న కళాత్మకమైన అందమైన వేదిక.
యలమంచిలి రూరల్: జిల్లా అంతటా దసరా వేడుకలు సరదాగా సాగుతున్నాయి. బొమ్మల కొలువులు ముచ్చట గొలుపుతున్నాయి. యలమంచిలి పట్టణంలోని ఓరుగంటివారి వీధిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు సుసర్ల భాగ్యలక్ష్మి, సూర్యప్రకాష్ దంపతులు తమ ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంటోంది. గత ఆరేళ్లుగా వీరు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఐదు వరుసల్లో సుమారు వెయ్యికి పైగా బొమ్మలతో పెట్టిన బొమ్మల కొలువు చూడ్డానికి గృహిణులు, పిల్లలు, విద్యార్థులు ఉపాధ్యాయ దంపతుల ఇంటికి వెళ్తున్నారు. అలాగే రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో ప్రముఖ పురోహితుడు కొట్ర దీక్షితులు ఇంట్లో గత 10 సంవత్సరాలుగా దసరా పండుగకు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. దీక్షితులు భార్య సూర్య గాయత్రి ప్రత్యేక శ్రద్ధతో బొమ్మల కొలువు తీర్చిదిద్దుతున్నారు. పురాణేతి హాసాల్లో కనిపించే దేవతల ప్రతిమలు, నవ దుర్గలు, త్రిమూర్తులు, హనుమ, లక్ష్మణ సమేత సీతారాములు, శ్రీనివాసకల్యాణ ఘట్టాలు, రాధాకృష్ణులు, గుడి, గ్రామం, వివాహ క్రతువు, సహపంక్తి భోజనం ఇలా.. వివిధ రకాల బొమ్మల్ని ఇక్కడ కొలువులో ఉంచారు.
ఎన్నెన్నో బొమ్మలు
బొమ్మల కొలువులో దేవుళ్ల బొమ్మలు, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు కనువిందు చేస్తున్నాయి. పంచాంగం బ్రాహ్మణుడు, పచారీకొట్టు వ్యాపారి, ఆవు దూడ, జంతువులు, పక్షులు, గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే బొమ్మలు ఇలా ఎన్నో రకాల బొమ్మలను కళాత్మకంగా అమర్చారు. ప్రతి ఏటా కొత్త బొమ్మలను జత పరుస్తున్నామని, మన సంస్కృతీ సంప్రదాయాలు భావితరాలకు తెలిసేలా చేయడమే బొమ్మల కొలువు లక్ష్యమని ఏటికొప్పాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సుసర్ల భాగ్యలక్ష్మి చెప్పారు. బొమ్మల కొలువు దసరా, దీపావళి, సంక్రాంతి పర్వదినాల్లో ఏర్పాటు చేయడం పూర్వీకుల నుంచి మనకు సంక్రమించిన సంస్కృతిలో భాగమని తెలుగు అధ్యాపకురాలు కొట్ర సూర్య గాయత్రి చెప్పారు. ఈ కాలం పిల్లలకు బొమ్మల కొలువు ద్వారా సులువుగా మన సంప్రదాయాల గురించి వివరించవచ్చన్నారు.

బొమ్మల కొలువు.. సంస్కృతికి నెలవు

బొమ్మల కొలువు.. సంస్కృతికి నెలవు