కట్టలు తెగిన ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

కట్టలు తెగిన ఆగ్రహం

Sep 30 2025 7:41 AM | Updated on Sep 30 2025 7:41 AM

కట్టల

కట్టలు తెగిన ఆగ్రహం

గంగపుత్రుల వీరావేశం హోంమంత్రికి నిరసన సెగ

వాహనం అడ్డగించిన మహిళలు నిలువరించలేకపోయిన పోలీసులు

బల్క్‌డ్రగ్‌ పార్కు రద్దుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో శాంతించిన మత్స్యకారులు

శుష్క వాగ్దానాలు వద్దని, పనులు ఆపితేనే మాట్లాడతామని స్పష్టీకరణ

నక్కపల్లి: తమ జీవితాలను నాశనం చేసే బల్క్‌డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటును నిరసిస్తూ మత్స్యకారులు చేస్తున్న నిరాహార దీక్ష రెండు వారాలుగా కొనసాగుతోంది. ఉద్యమం తీవ్రతరమై వేలాదిమంది మత్స్యకారులు రోడ్డెక్కి ఆందోళన కొనసాగిస్తున్నారు. పనులు మానుకుని కుటుంబాలతో సహా నిరసన దీక్షలో పాల్గొంటున్నారు. ఈ నేపధ్యంలో మత్స్యకారులతో మాట్లాడేందుకు రాజయ్యపేట వచ్చిన హోంమంత్రి అనితకు నిరసన సెగ అంటుకుంది. ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న మత్స్యకారులను అడ్డుకోవడం పోలీసుల తరం కాలేదు. మంత్రి ప్రయాణిస్తున్న వాహనాన్ని ముందుకు వెళ్లకుండా వేలాదిగా తరలివచ్చిన మత్స్యకారులు అడ్డుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి బల్క్‌డ్రగ్‌ పార్క్‌ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. పోలీసులు పట్టుకున్న రోప్‌వేలు మత్స్యకారులను ఏమాత్రం నిలువరించలేకపోయాయి. భారీగా మోహరించిన పోలీసులు మత్స్యకారులను ఏమాత్రం అడ్డుకోలేకపోయారు. తీవ్ర వాగ్వాదాల మధ్య మత్స్యకారులను శాంతింపచేసేందుకు హోంమంత్రి తీవ్ర ప్రయత్నం చేశారు. తొలుత అధికారాన్ని ఉపయోగించి పోలీసులతో మత్స్యకారులను భయపెట్టేందుకు ప్రయత్నించినా వారు లెక్కచేయకపోగా ఆగ్రహంతో మరింత రగిలిపోయారు. చివరకు మీ నాయకులతోనే కమిటీ వేసి న్యాయం చేస్తానని, బల్క్‌డ్రగ్‌ పార్కును రద్దు చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కొద్దిగా శాంతించిన మత్స్యకారులు వాహనానికి దారి ఇచ్చారు. ఆమె మాట్లాడేందుకు వీలుగా స్టేజ్‌ వరకు దారి ఇచ్చారు.

పనులు ఆపితేనే మాట్లాడతాం..

హోంమంత్రి అనిత వేదికపై నుంచి మాట్లాడుతూ.. మీ అందరూ కొలిచే నూకతాత సాక్షిగా చెబుతున్నా, బల్క్‌డ్రగ్‌ పార్కును రద్దు చేసి సమస్యను పరిష్కారం చేసేందుకు హామీ ఇస్తున్నానని చెప్పారు. ఇందు కోసం మీ గ్రామం నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే వారిని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళతానని హామీ ఇచ్చారు. తనను నమ్మాలని దసరా పండుగ అయిన వెంటనే కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం, సీఎంలతో చర్చలు జరిపించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే బల్క్‌డ్రగ్‌ పార్కు రద్దు గురించి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తమ నిరాహార దీక్ష కొనసాగుతుందని మత్స్యకారులు ముక్తకంఠంతో నినదించారు. బూటకపు హామీలు కాదని తక్షణమే పనులు ఆపాలని నినాదాలు చేశారు. కమిటీలు వేయాల్సిన పనిలేదని, డిప్యూటీ సీఎం, సీఎంలను కలిసే పనేలేదని తెగేసి చెప్పారు. మోసం చేసి తమ దీక్షను విరమింపజేయాలని చూస్తే సహించమన్నారు. చర్చలు జరిగేంత వరకు పనులను ఆపాలని నినాదాలు చేశారు. ఆమె పట్టించుకోకపోవడంతో హోం మంత్రి అనిత డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

కట్టలు తెగిన ఆగ్రహం1
1/1

కట్టలు తెగిన ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement