
చిట్టీల కేసుపై డీఎస్పీ విచారణ
కె.కోటపాడు: ఇటీవల చౌడువాడలో చిట్టీల పేరుతో మోసానికి పాల్పడిన పెదిరెడ్డి పద్మజపై ఇచ్చిన ఫిర్యాదుపై శుక్రవారం కె.కోటపాడులో అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి విచారణ జరిపారు. ఫిర్యాదుదారులైన గోలగాని మురళీతో పాటు మరికొందరి నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలను కోర్టుకు సమర్పించనున్నట్టు తెలిపారు. అక్రమంగా నిర్వహించే చిట్టీలలో ఎవరూ పెట్టుబడులను పెట్టరాదని ఆమె తెలిపారు. చట్ట విరుద్ధంగా చిట్టీలు నిర్వహించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. చిట్టీల నిర్వహణ గురించి సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందజేయాలని డీఎస్పీ శ్రావణి కోరారు.