
ఇదేం సాగునీటి సరఫరా?
● కాలువల పూడికతీత పనులను సకాలంలో చేపట్టడంలో అలసత్వం ● నీటి సరఫరాకు అడ్డుకట్ట వేసి పూడికతీత పనులు ● మూడు రోజులు గడుస్తున్నా పలు గ్రామాలకు అందని సాగునీరు ● రైవాడ ఆయకట్టు రైతుల పాలిట శాపంగా ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం
దేవరాపల్లి: ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం.. రైవాడ జలాశయం ఆయుకట్టు రైతుల పాలిట శాపంగా మారింది. జలాశయం నుంచి ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేసి మూడు రోజులు గడుస్తున్నా ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందని దుస్థితి నెలకొంది. జలాశయం పరిధిలోని పంట కాలువల్లో పూడికతీత, తుప్పలు, డొంకలు తొలగించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ ఆ పనులు సకాలంలో చేపట్టడంలో ఇరిగేషన్ అధికారులు విఫలమయ్యారు. ఖరీఫ్ పంటలకు సాగునీటిని విడుదల చేపట్టడానికి ముందుగానే ఈ పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు అడుగడుగునా అలసత్వం ప్రదర్శించడంతో అసంపూర్తిగా మిగిలాయి. అధికార టీడీపీ నాయకులు ఈ పనులు చేపట్టడంతో పనుల పర్యవేక్షణకు అధికారులు అటుగా కన్నెత్తి చూడలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నీటి విడుదల తేదీని సుమారు రెండు వారాల క్రితమే ప్రకటించారు. ఈలోగా యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్లు మాత్రం నత్తనడకన చేపట్టారు.
నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి పూడిక తీత పనులు
రైవాడ జలాశయం నుంచి ఎడమ కాలువ ద్వారా ఖరీఫ్ సాగుకు నీటి సరఫరా కొనసాగుతుంది. అయితే పెదనందిపల్లి శివారు సత్యనారాయణపురం సమీపంలోని ఎం.అలమండ, వేచలం వైపునకు వెళ్లే బ్రాంచి చానల్స్‌కు సంబంధించిన మదుం ఉంది. అక్కడి నుంచి ఎం.అలమండ వైపు సాగునీరు ప్రవహిస్తుండగా వేచలం వైపు బ్రాంచి కెనాల్‌కు అడ్డంగా మట్టి వేసి పూడికతీత, జంగిల్స్ తొలగింపు పనులను ప్రస్తుతం చేపడుతున్నారు. దీంతో వేచలం, మామిడిపల్లి, తారువ గ్రామాల పరిధిలోని సుమారు 3 వేల ఆయకట్టుకు సాగు నీరందని పరిస్థితి నెలకొంది. ఆయా గ్రామాల పరిధిలోని నారుమడులు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఇప్పటికే నాట్లు వేసిన వరి పొలాలు నెర్రెలు బారి ఎండిపోతుండటంతో ఆయా ప్రాంతాల రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి విడుదలకు ముందుగానే ఈ పనులు చేపట్టాల్సి ఉండగా గతంలో ఎన్నడూ లేని విధంగా నీరు విడుదల చేసిన తర్వాత పనులు చేపట్టడంపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా చేనులపాలెం సమీపంలో నీరు ప్రవహిస్తున్న పంట కాలువలో జేసీబీతో పూడితతీత పనులు చేపడుతుండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రవహించే నీటిలో పూడిక ఎలా వస్తుందని, ఇలా మొక్కుబడి పనులు చేపట్టడం వల్ల నిధులు వృథా తప్పా ఎవరికి ప్రయోజనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూడికతీత, జంగిల్స్ తొలగింపు పనులు మిగిలి ఉంటే తొలి దఫా నీటి విడుదల పూర్తయ్యాక చేపట్టాలి తప్పా.. ఒక చోట నీరు ప్రవహిస్తున్న కాలువలోను, మరో చోట కాలువకు నీటి సరఫరాను నిలిపి వేసి చేయడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
పనులు పూర్తి కాగానే నీటి సరఫరా
జలాశయం పరిధిలోని ఏడు కాలువల్లో పూడిక తీత, జంగిల్ క్లియరెన్స్‌కు సుమారు రూ.52 లక్షలు నిధులు మంజూరు చేశారు. ఈ పనులు సైతం దాదాపుగా పూర్తి చేశాం. వేచలం, మామిడిపల్లి, తారువ బ్రాంచి కెనాల్‌కు నీటి సరఫరాకు అడ్డుకట్ట వేయడం వాస్తవమే. రైతుల విజ్ఞప్తితో ఆ కాలువలో జేసీబీతో పూడిక, జంగిల్స్ తొలగింపు పనులు చేయిస్తున్నాం. పనులు పూర్తి కాగానే మూడు గ్రామాలకు సాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తాం. దేవరాపల్లి–చేనులపాలెం గ్రామాల మధ్య మేట వేయడంతో ప్రవహిస్తున్న కాలువలో జేసీబీతో తొలగింపు పనులు చేపడుతున్నాం.
– జి. సత్యంనాయుడు, ఇరిగేషన్ డీఈఈ

ఇదేం సాగునీటి సరఫరా?

ఇదేం సాగునీటి సరఫరా?