
గిరిజనులకు బండారు క్షమాపణ చెప్పాలి
● అదానీ హైడ్రో పవర్ ప్లాంట్లను రద్దు చేసినట్టు వక్రీకరించడం తగదు ● గిరిజనులను తప్పుదోవ పట్టించడం సరికాదు ● సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న ధ్వజం
దేవరాపల్లి: చింతలపూడి, పెదకోట ఏరియాలో అదానీ హైడ్రో పవర్ ప్లాంట్‌లకు ప్రభుత్వం అనుమతులు రద్దు చేసినట్టు ఈ ప్రాంత గిరిజనులు, రైవాడ ఆయకట్టు రైతులను తప్పుదోవ పట్టించేలా మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రకటనలు చేయడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న విమర్శించారు. రైవాడ జలాశయం వద్ద బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మంగళవారం రైవాడ జలాశయం నీటిని విడుదల చేసిన సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ దేవరాపల్లి మండలం చింతలపూడి, అనంతగిరి మండలం పెదకోట సమీపంలో నిర్మించబోయే అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను ప్రభుత్వం రద్దు చేస్తూ జీవో జారీ చేసిందని చెప్పడాన్ని ఖండించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రకటనలు చేసిన ఎమ్మెల్యే బండారు ఆయా ప్రాంతాల గిరిజనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైవాడ క్యాచ్‌మెట్ ఏరియాలో అదానీ హైడ్రో పవర్ ప్లాంట్‌లకు అనుమతులు ఇచ్చి రైవాడ ఉసురు తీస్తున్నారని, దీనికి స్థానిక ఎమ్మెల్యే బండారు పూర్తి బాధ్యత వహించాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కర్రివలస, కురుకుట్టి గ్రామాల పరిధిలో అదానీ హైడ్రో పవర్ ప్లాంట్‌లకు గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ నెల 28న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే బండారు దీనిని వక్రీకరించి చింతలపూడి సమీపంలోని మారిక, పెదకోట సమీపంలోని రేగులపాలెం ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేసినట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందని చెప్పారు. రైవాడ జలాశయానికి ఎక్కడ నుంచి నీరు వస్తుందన్న విషయం తెలియక కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మన్యం జిల్లాలో హైడ్రో పవర్ ప్లాంట్లను రద్దు చేశారని, ఇక్కడ గిరిజనుల భవిష్యత్ అంధకారంగా మారుతున్నా ఎంపీ సి.ఎం.రమేష్, ఎమ్మెల్యే బండారు నోరుమెదపక పోవడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ పవర్ ప్రాజెక్టులు నిర్మాణం జరిగితే రైవాడ ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందన్నారు.