
డీలర్లకు గుదిబండ
● ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో తంటా ● రేషన్ లబ్ధిదారులకే కాక డీలర్లకూ అవస్థలే ● ప్రజా వ్యతిరేకతతో వృద్ధులు, వికలాంగులకు ఇంటికే సరకులు అందిస్తామన్న సర్కారు ● రవాణా చార్జీలు చెల్లించకపోవడంతో డీలర్ల గగ్గోలు
నర్సీపట్నం: ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఎండీయూ వాహనాలను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో లబ్ధిదారులతోపాటు డీలర్లు సైతం సతమతమవుతున్నారు. ప్రజల నుంచి నిరసన వ్యక్తం కావడంతో వృద్ధులు, వికలాంగుల ఇళ్ల వద్దకే రేషన్ ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది. దీంతో భారం డీలర్లపై పడింది. ఇంటింటికీ రేషన్ సరకులు పంపిణీకి కొంత మంది డీలర్లు బైక్ వినియోగిస్తుండగా, ఆర్ధిక భారం తట్టుకోలేక మరికొంత మంది డీలర్లు కావిట్లో నిత్యావసర సరకులు పెట్టుకుని ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో సంబరాలు జరుపుకున్న డీలర్లు ఇంటింటికీ రేషన్ భారంతో నరకం చూస్తున్నారు. వాహనాల తొలగింపు తమ పాలిటశాపంగా మారిందని ఆవేదన చెందుతున్నారు.
డీలర్లపై ఆర్థిక భారం
జిల్లాలో మొత్తం 5,35,000 రైస్ కార్డులు ఉన్నాయి. అందులో 68 వేల మంది వృద్ధులు, వికలాంగులు ఉన్నారు. వీరికి ప్రతి నెల 25వ తేదీ నుంచి నెలాఖరులోగా ఇంటి వద్దే డీలర్లు బియ్యం, పంచదార అందించాల్సి వస్తోంది. ప్రభుత్వం రవాణా చార్జీలు ఇవ్వకపోవడంతో ఆర్థిక భారాన్ని వారే భరిస్తున్నారు. రవాణా ఖర్చులు భరించలేక కొంతమంది డీలర్లు ఐదు కేజీల చొప్పున బియ్యం సంచుల్లో ప్యాక్ చేసి, కావిట్లో తీసుకువెళ్లి లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఎండీయూ వాహనాలు ఉన్నప్పుడే తమ ప్రాణం సుఖంగా ఉండేదని డీలర్లు వాపోతున్నారు. రేషన్ బియ్యం తూకం వేసేందుకు తమ సొంత ఖర్చులతో హెల్పర్‌ను పెట్టుకుంటున్నామని, దీని వల్ల నెలకు రూ.3 వేల వరకు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సీఎస్‌డీటీ చందన రేఖను సంప్రదించగా ఇంటింటి రేషన్ పంపిణీకి ప్రభుత్వం రవాణా చార్జీలు ఇవ్వటం లేదని, ఆ బాధ్యత డీలర్లదేనని తెలిపారు.