
వైఎస్ జగన్ దృష్టికి నిర్వాసితుల సమస్య
● విశాఖ–చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్‌కు భూములిచ్చిన రైతులు ● నేడు పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం అష్టకష్టాలు ● అన్నదాతల ఆవేదన వివరించిన వైఎస్సార్‌సీపీ నేతలు
సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ కలిశారు. బుధవారం తాడేపల్లిలో గల క్యాంప్ కార్యాలయంలో పార్టీ అధినేతను కలిసి.. విశాఖ–చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు ఇచ్చిన నక్కపల్లి మండలం రైతులు నష్టపరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం గత ఆరు నెలలుగా ఎలా పోరాడుతున్నారో వివరించారు. 2014లో భూములు తీసుకునే సమయంలో భూసేకరణ చట్టం–2013 ప్రకారం నష్టపరిహారం, ప్యాకేజీ ఇస్తామని చెప్పి నాటి టీడీపీ ప్రభుత్వం ఎలా ఏమార్చిందో వివరించారు. ఇప్పుడు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం, అధికారులు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ప్యాకేజీ కింద రూ.25 లక్షలు ఇవ్వాలని చందనాడ, మూలపార, తమ్మయ్యపేట రైతులు డిమాడ్ చేస్తూ ఏడాది నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నిర్వాసితుల్లో మేజర్‌లకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలియజేశారు. అంతేకాకుండా బల్క్‌డ్రగ్ పార్క్, మిట్టల్ స్టీల్‌ప్లాంట్ కోసం అదనంగా మరో 3,500 ఎకరాలను సేకరించడానికి పూనుకొని, కాగిత, వేంపాడు, డి.ఎల్.పురం గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేశారని, కానీ రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించడం లేదన్నారు. అదనంగా భూములు సేకరించి కార్పొరేట్ పెద్దలకు కట్టబెట్టే యత్నాలు జరుగుతున్నాయని వివరించారు. బాధితులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ తరపున పాదయాత్రలు, ఆందోళనలు చేస్తున్నామని వివరించారు. రైతుల పక్షాన పోరాటం చేయాలని, అదనపు భూసేకరణను రైతులు వ్యతిరేకిస్తే అవసరమైతే వారి తరపున పోరాటానికి తాను కూడా హజరవుతాయని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని వారు తెలిపారు.