
కందిపప్పుకు మంగళం!
● ఏడు నెలలుగా అందించని రాష్ట్ర ప్రభుత్వం ● 546 మెట్రిక్ టన్నుల సరఫరాకు ఎగనామం ● సామాన్యులపై రూ.45 కోట్ల భారం
అనకాపల్లి టౌన్: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కందిపప్పు పంపిణీకి మంగళం పాడేసింది. గత ఏడు నెలలుగా కందిపప్పును రేషన్ డిపోల ద్వారా సరఫరాను నిలిపివేసింది. కందిపప్పు కొనుగోలుకు టెండర్లు పిలవడం ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు కనిపించడంలేదు. దీంతో జిల్లాలో ఉన్న పేదవారిపై కోట్ల రూపాయల భారం పడుతుంది. కందిపప్పు బలవర్ధకమైన ఆహార పదార్ధం. చక్కగా ప్రోటీన్ లభిస్తుంది. సామాన్యుల దగ్గర నుంచి డబ్బున్నవాడు వరకూ కందిపప్పును విరివిగా వాడుతుంటారు. సామాన్యుడు చౌకధరల దుకాణంలో లభించే కందిపప్పు కోసం ఎదురు చూస్తుంటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలుగా రేషన్ షాపులలో కందిపప్పు, రాగులు, గోధుమపిండి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాగులు, గోధుముల సంగతి పక్కన పెడితే కనీసం కందిపప్పు సరఫరా చేయడంతో కూడా ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ నెల కూడా కందిపప్పును అడగొద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 5,37,038 మంది కార్డుదారులకు 14,99,000 యూనిట్‌దారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 7652 మెట్రిక్ టన్నుల బియ్యం, 264 మెట్రిక్ టన్నుల పంచదార, 546 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 544 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి, 1628 మెట్రిక్ టన్నుల రాగులు సరఫరా చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవి నిలిచిపోయాయి. కొన్ని నెలలు అరకొరగా పంపిణీ చేసిన ప్రభుత్వం ఆరు నెలలుగా పూర్తిగా నిలిపివేసింది. పేదలకు నిత్యావసర వస్తువైన కందిపప్పును సరఫరా చేయలేని ప్రభుత్వం రాగులు, గోధుమ ఇంకేమి ఇస్తుందని కార్డుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే రేషన్ షాపుల్లో పూర్తిగా కందిపప్పు నిలిపివేస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యం కేంద్రం ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం అరకేజీ పంచదార ఇచ్చి చేతులు దులిపేసుకుంటుంది. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర నాణ్యతను బట్టి 110 నుంచి రూ.120 ఉంటుంది. కూటమి నేతలు అధికారంలోకి రాక ముందు రేషన్ షాపులను బలోపేతం చేస్తామని నిత్యావసరాలైన బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, రాగి పిండి తదితర వాటిని రాయితీపై అందజేస్తామని ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక్క నెల కూడా సరుకులు సరఫరా చేయలేదేమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రజలకు మరింత సమాచారం అందించడం కోసం జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి మూర్తిని ఫోన్‌లో సంప్రదించాలని ప్రయత్నం చేయగా అందుబాటులోకి రావడం లేదు.