
కూటమి పొత్తులో మొదట రాజీ పడింది నేనే
● అనకాపల్లి ఎంపీ సీటు వదులుకున్నాను
● జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు
అనకాపల్లి: జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి పొత్తులో రాజీపడిన మొట్టమొదటి వ్యక్తిని తానేనని, పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశించిన మరుక్షణమే అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ నుంచి తప్పుకున్నట్లు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు అన్నారు. గురువారం స్థానిక గవరపాలెంలోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి పొత్తు ధర్మమే ప్రథమ ప్రాధాన్యతగా నడుచుకోవాల్సిన బాధ్యత మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలకు ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి జనసేన పార్టీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. జనసేన ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయకుమార్, పంచకర్ల రమేష్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.