
టీడీఆర్ బాండ్లు వద్దే వద్దు
అనకాపల్లి టౌన్: అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితులకు ఇళ్లు, దుకాణాలు, భూములకు ఒకేసారి నష్టపరిహారం చెల్లించాలని, ఆ నష్టపరిహారం టీడీఆర్ బాండ్ల రూపంలో కాకుండా నగదు రూపంలోనే అందించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని మునగపాక నుంచి పాదయాత్ర ద్వారా అనకాపల్లి ఆర్డీవో కార్యాలయానికి సోమవారం చేరుకొని కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రోడ్డు విస్తరణ నిర్వాసితుల సంఘం కన్వీనర్ ఆర్.రాము మాట్లాడుతూ గతంలో నిర్వహించిన గ్రామ సభల్లో టీడీఆర్ బాండ్లు వద్దని నిర్వాసితులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారని తెలిపారు. అయినా నేడు నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లే ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ భూములు కోల్పోతున్నవారందరూ పేదవారని, వారికి టీడీఆర్ బాండ్లు ఏమాత్రం ఉపయోగపడవన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పునరావాసం కల్పించాలన్నారు. అలాగే ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు పరిహారం ఇవ్వడంతోపాటు ప్రభుత్వమే ఉపాధి కల్పించాలన్నారు. 100 అడుగుల తర్వాత నిర్మించుకొనే ఇళ్లకు ఎటువంటి నిబంధనలు పెట్టరాదన్నారు. రైతులను ఉద్దేశించి ఆర్డీవో షేక్ ఆయిషా మాట్లాడుతూ రైతుల భూముల విలువలో తేడాలుంటే కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని, వాటిని సరిచేస్తామన్నారు. టీడీఆర్‌లపై రైతులు అపోహలు విడనాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కో–కన్వీనర్ కె.రామసదాశివరావు పాల్గొన్నారు.
నగదు రూపంలోనే పరిహారం అందించాలి
అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితుల డిమాండ్
అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా