బినామీ సొమ్ము బాబు పాలు! | - | Sakshi
Sakshi News home page

బినామీ సొమ్ము బాబు పాలు!

Published Thu, Feb 29 2024 7:36 PM | Last Updated on Thu, Feb 29 2024 7:36 PM

- - Sakshi

● జనసేనలో చక్రం తిప్పుతున్న ఇద్దరు నేతలు ● ఎంపీగా పోటీ చేస్తే ఎన్నికల ఖర్చంతా భరిస్తామని ఓ ‘బాబు’కు హామీ ● రూ. 50 కోట్ల మేర భరించేందుకు సిద్ధమని వెల్లడి ● ఇదంతా ఓ కార్పొరేట్‌ కంపెనీ డైరెక్టర్‌ బినామీ సొమ్మని ప్రచారం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

నసేనకు చెందిన ‘బాబు’ను ఎంపీగా బరిలో దింపేందుకు ఆ పార్టీలోని ఇద్దరు నేతలు చేస్తున్న హడావుడి వెనుక ఓ కార్పొరేట్‌ కంపెనీ డైరెక్టర్‌ బినామీ డబ్బుల గలగలలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఎంపీగా బరిలో నిలిస్తే అయ్యే మొత్తం ఖర్చును తామే భరిస్తామంటూ ఇద్దరు నేతలు సదరు బాబు ముందు ప్రతిపాదించారు. ఇందుకు అనుగుణంగా ఆ నేత కూడా ఎంపీగా బరిలో నిలిచేందుకు నియోజకవర్గంలో హడావుడి చేస్తున్నారు. ఎన్నికల ఖర్చు రూ.50 కోట్ల వరకు తాము భరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇందుకు ప్రతిఫలంగా తమకు రెండు సీట్లు కావాలంటూ ప్రతిపాదించారు. ఇందుకు ఆ నేత కూడా ప్రాథమికంగా అంగీకరించినట్టు తెలిసింది. జనసేన అధినేతకు చెప్పి రెండు సీట్లు ఇప్పించే పూచీ నాదీ అని ఆ ‘బాబు’ కూడా హామీ ఇచ్చారని ఈ ఇద్దరూ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. పోర్టులో ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసే వారికి తోడు తాజాగా పార్టీలో చేరిన మరో నేత కూడా జతకట్టారు. వీరంతా కలిసి సదరు బాబును ముగ్గులోకి దించి ముచ్చటగా తమ పని కానించుకుంటున్నట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.

బినామీగా ఉంటూ బిల్డప్‌!

వాస్తవానికి పెద్దగా ఆర్థికంగా బలంగా లేని సదరు నేతలు పార్టీలో ముఖ్యుల వద్ద చేస్తున్న హడావుడి చూసి పార్టీలోని ఇతర నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఓ కార్పొరేట్‌ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తికి వీరిలో ఒకరు బినామీగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా పోర్టులో కాంట్రాక్టు పనిచేసే సదరు వ్యక్తితో కలిసి ఆ కంపెనీ డైరెక్టర్‌ వ్యాపారలావాదేవీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన ఈ నేత వద్ద భారీ మొత్తం బినామీగా ఉంచినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తాన్ని చూపించే ఇప్పుడు ఎన్నికల వ్యయాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారని పార్టీలోని సీనియర్‌ నేతలు పేర్కొంటున్నారు. తాము ఫలానా కంపెనీకి బొగ్గును దిగుమతి చేశామని, రూ.100 కోట్ల బిల్లుల కోసం వెళుతున్నామంటూ ‘బాబు’ వద్ద హడావుడి చేసి బుట్టలో వేసుకున్నారని పార్టీలోని సీనియర్‌ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అంతేకాకుండా కొద్దిరోజుల క్రితం ‘బాబు’ ఇంట్లో జరిగిన పెళ్లికి కూడా రూ. 2 కోట్ల మేర నగదును ఇవ్వడంతో పాటు.. ఆ పెళ్లికి కార్పొరేట్‌ కంపెనీ డైరెక్టర్‌ను కూడా తమతో తీసుకెళ్లారని సమాచారం. వీరి బుట్టలో పడిన ఆ ‘బాబు’ రోజువారీ కార్యక్రమాలన్నీ వారు చెప్పినట్టే ఉంటున్నాయని సీనియర్లు వాపోతున్నారు. మరోవైపు పార్టీలో ప్రజల్లో బలం ఉన్న నేతలను కాదని... పైరవీకార్లకు ప్రాధాన్యత పెరుగుతోందని సీనియర్లు వాపోతున్నారు. పార్టీలో సీట్ల అమ్మకాలు జరిగిపోతున్నాయని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోర్టు వ్యాపారంలో ఉన్న మరో ఇద్దరు నేతలు కాస్తా... ఈ బినామీల వ్యవహారాన్ని ఆ కార్పొరేట్‌ డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement